Sir: దాదాపు పాతికేళ్ళ క్రితం ‘ప్రేమకథ’తో సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ విజయం సాధించిన చిత్రాలను చేతి వేళ్ళ మీద లెక్కపెట్టాల్సిందే! అలాంటి సుమంత్… ఇప్పుడు హీరోగా ఓ పక్క నటిస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారిపోయాడు. ఆ మధ్య ఎన్టీయార్ బయోపిక్ లో తన తాతయ్య అక్కినేనిగా అతిథి పాత్రలో మెరిసిన సుమంత్… గత యేడాది వచ్చిన ‘సీతారామం’ మూవీలో కీ-రోల్ ప్లే చేశాడు. అతని పోషించిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర గురించి మూవీ రిలీజ్ కు ముందు దర్శక నిర్మాతలు చక్కని ప్రచారమే చేశారు. కానీ అది నెగెటివ్ రోల్ అనేది మాత్రం రివీల్ చేయకుండా దాచిపెట్టారు. వెండితెర మీద సుమంత్ పాత్రలోని నెగెటివ్ షేడ్స్ చూసి ఆడియెన్స్ అవాక్కయ్యారు. సుమంత్ ఇలాంటి పాత్ర చేశాడేమిటీ అని చర్చించుకోవడం మొదలెట్టారు. అదే అతనికి ప్లస్ అయ్యింది. సుమంత్ ను ఈ తరహా పాత్రలో ఊహించలేదని అనేకమంది అనడంతో అతని పాత్రపై ఫోకస్ పెరిగింది.
‘సీతారామం’ మూవీ హిట్ కావడం వల్ల కావచ్చు… తాజాగా వచ్చిన ‘సార్’ మూవీలోనూ సుమంత్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. అయితే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు రహస్యంగా ఉంచేశారు. సుమంత్ ఈ సినిమాలో నటించిన విషయం కూడా ఎక్కడా లీక్ కాలేదు. తెర మీద ఎ. ఎస్. మూర్తి అనే కడప కలెక్టర్ క్యారెక్టర్ లో సుమంత్ ను చూడగానే ఆడియెన్స్ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దానికి తోడు క్లయిమాక్స్ లో ఆ పాత్రను రివీల్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ పాత్రను చక్కగా ప్రెజెంట్ చేశాడు.
ఓ రకంగా ఇలాంటి క్యారెక్టర్స్ కు సుమంత్ ప్రాధాన్యమిచ్చి మరిన్ని సినిమాలు చేస్తే బెటర్. ఎందుకంటే… అతనికి సోలో హీరోగా హిట్ వచ్చి దాదాపు నాలుగైదేళ్ళు అవుతోంది. ‘మళ్ళీ రావా’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని సుమంత్ అందుకోలేదు. అలానే ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమైనా ఇంకా విడుదలకు నోచుకోలేదు. హీరోగా నటిస్తున్న ‘వారాహి’ మూవీ ఎంతవరకూ వచ్చిందో తెలియదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో హీరోగా నటించి, సినిమాను భుజానకెత్తుకుని ప్రచారం చేసి, థియేటర్ కు జనాలను తీసుకురావడం అనేది సుమంత్ లాంటి నటుడికి కష్టమే. అతనిలో మంచి నటుడు ఉన్నాడు కాబ్టటి… ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటే బావుంటుంది.