హీరోగానే కాదు… అవకాశం ఇస్తే విలన్ గానూ నటించడానికి సై అంటాడు నవీన్ చంద్ర. ఇప్పటికే పలు చిత్రాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఏప్రిల్ 8న విడుదల కాబోతున్న ‘గని’ చిత్రంలో బాక్సర్ ఆది పాత్రను పోషిస్తున్నాడు నవీన్ చంద్ర. ఆది పాత్ర, దాని తీరుతెన్నుల గురించి నవీన్ చంద్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ”బాక్సింగ్ అంటే మొదటి నుండి ఇష్టం. రైల్వేస్ లో పనిచేసే మా మావయ్య శివరాజ్ నేషనల్ లెవల్ బాక్సర్. నాలుగేళ్ళ వయసులో ఆయన విగరస్ గా చేసే ప్రాక్టీస్ చూస్తుండేవాడిని. చిన్నతనంలో బాక్సర్ కావాలని ఉండేది. కానీ నటుడిని అయ్యాను. ఆ మధ్య వచ్చిన ‘సార్పట్ట పరంపర’ చిత్రంలో నాకు బాక్సర్ గా నటించే ఛాన్స్ వచ్చింది. బట్ ఆ పాత్ర మిస్ అయ్యింది. అయ్యో అని బాధపడుతున్న సమయంలో ‘గని’లో బాక్సర్ పాత్ర లభించి, సంతోషాన్ని కలిగించింది” అని అన్నారు.
కరోనా సమయంలో దర్శక నిర్మాతలు తనను ఈ పాత్ర కోసం సంప్రదించారని నవీన్ చంద్ర చెబుతూ, ”దాదాపు రెండు, మూడు సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది. కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయ్యాయి. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులకు రోజూ కొవిడ్ టెస్ట్ చేయడం, ఒకవేళ ఎవరికైనా కరోనా వస్తే వారికి వైద్య సేవలు అందించడం జరిగేది. నిర్మాతలు యూనిట్ సభ్యుల పట్ల చూపించిన ప్రేమ నన్ను కదిలించి వేసింది” అని అన్నారు. సమ్మర్ లో ఫుల్ లైటింగ్ మధ్య బాక్సింగ్ ఎరీనాలో నిలిచి పోరాటం చేయడం సామాన్య విషయం కాదని, సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ ఫిట్ నెస్ ను మెయిన్ టైన్ చేయడం చాలా కష్టంగా అనిపించింద’ని నవీన్ చంద్ర చెప్పారు.
సునీల్ శెట్టి సూపర్!
‘గని’ చిత్రంలో ఉపేంద్రతో పాటు సునీల్ శెట్టి సైతం కీలక పాత్ర పోషించారు. ఉపేంద్ర కాంబినేషన్ లో తనకు సీన్స్ లేవని, సునీల్ శెట్టితో ఎక్కువ సన్నివేశాలు చేశానని నవీన్ చంద్ర చెప్పారు. గతంలోనూ ‘మోసగాళ్ళు’ మూవీలో సునీల్ శెట్టితో కలిసి నటించానని నవీన్ చంద్ర చెబుతూ, ‘రోజు రోజుకూ ఆయన యంగ్ గా కనిపిస్తున్నారని, ఈ తరం యువ నటులు ఆయన్ని చూసి ఫిజికల్ ఫిట్ నెస్ ఎలా మెయిన్ టైన్ చేయాలో తెలుసుకోవాల’ని నవీన్ చంద్ర అన్నారు. ఇందులో వరుణ్ తేజ్ పోషించిన ‘గని’ పాత్రను ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిమానిస్తారని, సినిమా విజయంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, దర్శకుడు కిరణ్ పడిన శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని అన్నారు. తాను నటించిన ఎనిమిది చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయని, అలానే ‘పరంపర’ వెబ్ సీరిస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ కావాల్సి ఉందని నవీన్ చంద్ర చెప్పారు.