యంగ్ హీరో శర్వానంద్ నటిస్టున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు…’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. తన జీవితం అలా కావడానికి కారణమైన ఆడవాళ్లందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు.
తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ సదరు హీరో నిందిస్తున్నట్టుగా ఈ పాట సాగింది. శ్రీమణి రాసిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాడటం విశేషం! హీరో జీవితంలోని కీలకమైన వ్యక్తులు కుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ, సత్య తదితరులను ఉద్దేశిస్తూ శర్వా ఈ పాటను పాడాడు. మధ్య మధ్యలో రష్మిక మందన్నా సైతం చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అందించిన ఈ మాస్ బీట్, ఫన్నీ సాంగ్ కు యూ ట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.