గత వారంలో తెలుగులో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దంత సందడి చేయలేకపోయింది. బంజారా చిత్రం ‘సేవాదాస్’, ఆంగ్ల అనువాద చిత్రం ‘మోర్బియస్’ కూడా లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యాయి. అయితే గత వారం కూడా థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడే కనిపించింది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గడంతో ‘ట్రిపుల్ ఆర్’కు రిపీట్ ఆడియెన్స్ రావడం మొదలు పెట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
8వ తేదీ 7 సినిమాలు!
ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ఏడు సినిమాలు తెలుగులో జనం ముందుకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ ‘గని’ మూవీ గురించి. ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమా ఇది. దీనికంటే ముందే ‘ఎఫ్ 3’ వస్తుందని భావించారు కానీ అది మే నెలకు పోస్ట్ పోన్ అయ్యింది. ఉత్తరాది భామ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బాక్సింగ్ నేపథ్య కుటుంబ కథా చిత్రంతో కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబ్జీ తన కజిన్ సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన ‘గని’కి తమన్ సంగీతం అందించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో నర్తించిన ‘గని’లో ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ సినిమాను 8వ తేదీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు.
Read Also : Ghani : వరుణ్ తేజ్ ఆ గండం నుంచి గట్టెక్కుతాడా ?
ఇప్పుడు దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సైతం పాన్ ఇండియా మూవీస్ పై దృష్టిపెట్టాడు. లెస్బియనిజం థీమ్ తో వర్మ తీసిన ‘డేంజరస్’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో శుక్రవారం విడుదల చేస్తున్నాడు. నైనా గంగూలీ, అప్సరా రాణీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. సుప్రీం కోర్టు ఎల్.జి.బి.టి. పై సరికొత్త తీర్పును ఇచ్చిన తర్వాత వస్తున్న ఫస్ట్ లెస్బియన్ మూవీ తమదేనని వర్మ చెబుతున్నారు. త్రిగుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించిన హారర్ డ్రామా ‘కథ కంచికి మనం ఇంటికి’ సినిమా కూడా శుక్రవారమే రిలీజ్ అవుతోంది. చాణక్య చిన్నా దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన బాణీలు కొన్ని ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక కోడి పందాల నేపథ్యంలో సురేశ్ రెడ్డి దర్శకత్వంలో మునికృష్ణ, గీతా కృష్ణ నిర్మించిన ‘బరి’ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. నాగ మహేశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రాజా, సహన జంటగా నటించారు. రమణ్ హీరోగా వాణీ విశ్వనాథ్ చెల్లెలు కూతురు వర్ష హీరోయిన్ గా నటించిన ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ మూవీ కూడా ఫ్రైడే వస్తోంది. ఇందులో లావణ్య శర్మ, పావని, ప్రియాంక రౌరీ కూడా హీరోయిన్స్ గానే నటించారు. రమేశ్ – గోపి దర్శకత్వంలో ఈ సినిమాను శిరీషా రమణా రెడ్డి నిర్మించారు. స్వర్గీయ చక్రి సోదరుడు మహిత్ నారాయణ సంగీతం అందించగా శ్రీవసంత్ ఆర్.ఆర్. ఇచ్చారు. ఈ శుక్రవారమే మరో రెండో డబ్బింగ్ సినిమాలూ తెలుగులో రాబోతున్నాయి. ‘గద్దలకొండ గణేశ్’తో మన వారికి చేరువైనా అధర్వ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డస్టర్’ తెలుగులో వస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మిస్తీ చక్రవర్తి, అనైక సోథి ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. అలానే ఆంగ్ల చిత్రం ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్: ద సీక్రెట్స్ ఆఫ్ డంబెల్డోర్’ మూవీ కూడా తెలుగులో డబ్ అయ్యి శుక్రవారం రిలీజ్ అవుతోంది. మరి వీటిలో ఏ చిత్రాలను జనం ఆదరిస్తారో చూడాలి.