నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో విశేషం! ఇలా ఈ ఇద్దరు మహానటుల కెరీర్ కూడా విశేషాలతో పెనవేసుకు పోయింది. యన్టీఆర్ జానపద కథానాయకునిగా రాజ్యమేలుతున్న రోజుల్లో ఏయన్నార్ ఎక్కువగా సాంఘికాలలోనే నటించారు. రామారావు వచ్చాక నాగేశ్వరరావు జానపద చిత్రాలలో అనూహ్య విజయం సాధించిన ఘనత ‘సువర్ణసుందరి’కే దక్కుతుంది. 1957 మే 10న విడుదలైన ‘సువర్ణసుందరి’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ యేడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది.
‘సువర్ణసుందరి’ కథ ఏమిటంటే – మాళవ దేశ యువరాజు జయంతునిపై ఆ దేశ రాజగురువు కూతురు సరళ మనసు పడుతుంది. కానీ, జయంతుడు ఆమెను ఆ దృష్టితో చూడలేదంటాడు. దాంతో మహారాజు వద్దకు వెళ్ళి తనను జయంత్ మోసం చేశాడని చెబుతుంది. రాజగురువుపై భక్తితో మహారాజు జయంతునికి దేశబహిష్కరణ విధిస్తాడు. జయంతుని ముగ్గురు మోసగాళ్ళు నమ్మించి, ఓ గుహలోకి పంపుతారు. అక్కడ ఒకరికి శాపవిముక్తి కలిగించిన జయంతునికి మూడు అద్భుత వస్తువులు ప్రసాదిస్తాడు శాపవిమోచన పొందిన వ్యక్తి. వాటిలో కమండలం కోరిన వాటిని ప్రసాదిస్తుంది. దండం ప్రత్యర్థులను చిత్తు చేస్తుంది. ఇక చాప మీద ఎక్కి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. జయంతుడు బయటకు రాగానే, అతణ్ణి కొట్టి వాటిని ముగ్గురు మోసగాళ్ళు పంచుకుంటారు. పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్న చోట పడతాడు జయంత్. అక్కడ అతనికి స్పృహ వస్తుంది. అదే సమయంలో ఇంద్రలోకం నుండి దేవకన్యలు వచ్చి అక్కడ పరమశివుని ధ్యానిస్తూ నాట్యం చేస్తారు. వారిలో ముఖ్యురాలు సువర్ణసుందరి. ఆమె పైట చెంగును పట్టుకున్న జయంత్ తో సువర్ణసుందరికి పరిచయం అవుతుంది. వారు ప్రేమలో పడతారు. తనను పిలవడానికి ఓ పిల్లనగ్రోవిని ఇస్తుంది సువర్ణసుందరి. తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఓ రోజు దేవేంద్రుని ముందు నాట్యం చేస్తున్న సువర్ణసుందరి స్పృహ తప్పి పడుతుంది. ఆమె గర్భవతి అని తెలుస్తుంది. దేవేంద్రుడు ఆమెను భూలోకంలోకి పొమ్మని శపిస్తాడు. తరువాత సువర్ణసుందరి పలు పాట్లు పడుతుంది. ఓ నాగకన్య జయంత్ ను స్త్రీగా మారమని శపిస్తుంది. అతని ప్రార్థన విన్న నాగకన్య, శాంతించి రాత్రి పురుషునిగా, పగలు స్త్రీగా ఉండేలా అనుగ్రహిస్తుంది. అమృతం కురిసినప్పుడు అతనికి శాపవిమోచనం కలుగుతుందని చెబుతుంది. సువర్ణసుందరికి భూలోకంలో ఓ మునిశాపం వల్ల భర్త ఆమెను మరచిపోతాడు. సుందరిని ఆమె భర్త తాకితే, అతడు పాశాణంగా మారతాడని అంటాడు. సువర్ణసుందరి ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బాబు ఓ తాత దగ్గర పెరుగుతాడు. సువర్ణసుందరి భూలోకంలో పలు పాట్లు పడుతుంది. దుర్మార్గుల బారి నుండి తనను కాపాడుకోవడానికి పురుషవేషంలో సంచరిస్తుంది. ఏనుగు పురుష వేషంలో ఉన్న సుందరి మెడలో మాల వేయగా, ఆమె ఓ దేశానికి మంత్రి అవుతుంది. అదే దేశంలో జయంతుడు తలదాచుకుంటాడు. ముగ్గురు మోసగాళ్లు మళ్ళీ జయంతుని జీవితంలో ప్రవేశిస్తారు. ఒక్కోడు ఒక్కోలా చితికి పోతారు. వారి నుండి ఓ రాక్షసుడు కమండలం, దండం, చాప సంపాదిస్తాడు. ఆ రాకాసి ముందు స్త్రీ రూపంలో ఉన్న జయంతుడు నాట్యం చేసి, కమండలంతో అమృతం కురిపించమంటాడు. రాక్షసుడు అలాగే చేస్తాడు. జయంతునికి నిజరూపం వస్తుంది. రాక్షసుడిపైకి దండం విసరి చంపేస్తాడు జయంతుడు. ఇదంతా సువర్ణసుందరి చూస్తుంది. ఆమెను గుర్తుపట్టని జయంతుడు తనకు ఉపకారం చేసిన ఆమెను గౌరవిస్తాడు. ఆమెను తాకగానే అతడు శాపవశాన పాశాణంగా మారుతూ ఉంటాడు. శివపార్వతుల విగ్రహాల వద్దే సుందరి, జయంత్ కుమారుడు శివకుమార ఉంటాడు. అతను మహిమ గల చాప ఎక్కి దేవలోకం వెళ్ళి తండ్రి శాపవిముక్తికై సువర్ణ పుష్పం తెస్తాడు. దాంతో ఆ బాలునిపైకి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తాడు. శివకుమార చాపపై ఎక్కి వచ్చి, సువర్ణ పుష్పం పెట్టి తండ్రికి శాపవిముక్తి కలిగిస్తాడు. శివుని త్రిశూలం వజ్రాయుధాన్ని అడ్డగిస్తుంది. పరమేశ్వరుడు ఇంద్రుని మందలిస్తాడు. జయంత్, సువర్ణసుందరితోనూ, శివకుమార తోనూ కలసి స్వదేశం వెళతాడు. అక్కడ మాళవ దేశానికి మిత్రుడైన రాజు వచ్చి, తన కూతురును జయంతునికి ఇవ్వాలని భావించినట్టు చెబుతాడు. మాయా చాపపై ఎక్కి జయంతుడు భార్యాబిడ్డలతో వస్తాడు. జరిగిందంతా చెబుతాడు. ఏ రాజు వద్ద సువర్ణసుందరి మంత్రిగా పనిచేసిందో, ఆ రాజు కూతురు తమ దేశంలో ఉన్నపుడు జయంతుని చూసి ప్రేమించి ఉంటుంది. అందువల్ల ఆమెను కూడా జయంతుడు భార్యగా స్వీకరించడంతో కథ సుఖాంతమవుతుంది.
అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, రాజసులోచన, గిరిజ, రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ, గుమ్మడి, సిఎస్సార్ ఆంజనేయులు, పేకేటి శివరామ్, సూర్యకళ, ఇ.వి.సరోజ, మాస్టర్ బాబ్జీ ముఖ్యతారాగణం. ఈ చిత్రాన్ని తమ అంజలీ పిక్చర్స్ పతాకంపై అంజలీదేవి భర్త పి. ఆదినారాయణ రావు నిర్మించారు. ఈ చిత్రానికి కథను, సంగీతాన్నికూడా ఆయనే సమకూర్చారు. సముద్రాల, కొసరాజు పాటలు పలికించారు. ఇందులోని “జగదీశ్వరా… పాహి పరమేశ్వరా…”, “పిలువకురా… అలుగకురా…”, “హాయి హాయిగా ఆమని సాగె…”, “బంగారు వన్నెల…”, “బొమ్మలమ్మా బొమ్మలు…”, “అమ్మా అమ్మా…”, “ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా…”, “నీ నీడలోన నిలిచానురా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘సువర్ణసుందరి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఇందులో ఏయన్నార్ పాత్రకు అంత ప్రాముఖ్యం లేకపోయినా, కేవలం అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులతో తనకున్న అనుబంధం కారణంగా నటించానని పలుమార్లు చెప్పుకున్నారు. 1957లో విడుదలై విజయఢంకా మోగించిన ‘మాయాబజార్’ వసూళ్ళ వర్షం కురిపించింది. ఆ యేడాది ‘మాయాబజార్’ తరువాత ఆ స్థాయిలో అలరించిన చిత్రం ‘సువర్ణసుందరి’ అనే చెప్పాలి. ఈ చిత్రం కూడా 20కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. రజతోత్సవాన్నీ చూసింది. తరువాతి రోజుల్లో ఈ సినిమా 36 కేంద్రాలలో శతదినోత్సవం, 6 కేంద్రాలలో రజతోత్సవం చూసినట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా తెలుగునాట సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకొని దీనిని హిందీలోనూ తెరకెక్కించాలని తలచారు నిర్మాత పి.ఆదినారాయణ రావు. తరువాతి సంవత్సరం హిందీలో ‘సువర్ణసుందరి’గానే ఈ చిత్రం రూపొంది విడుదలయింది. ఆ చిత్రానికీ ఆదినారాయణ రావే సంగీతం సమకూర్చారు. హిందీలో ఏయన్నార్ కు మహ్మద్ రఫీ గానం చేశారు. ఏయన్నార్ తన కెరీర్ లో నటించిన ఏకైక హిందీ చిత్రంగా ‘సువర్ణ సుందరి’ నిలచింది. హిందీలోనూ ‘సువర్ణ సుందరి’ రజతోత్సవం చూసింది