(డిసెంబర్ 14తో కాబులీవాలాకు 60 ఏళ్ళు)
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మాతృభాష బెంగాలీలో అనేక కథలు రచించారు. వాటిలో కాబులీవాలా ప్రత్యేకమైనది. అందులో మానవత్వం మన మదిని తడుతుంది. బంధాలు-అనుబంధాల్లోని మాధుర్యం మనను వెంటాడుతుంది. అందుకే గొప్పకథల్లో ఒకటిగా కాబులీవాలా వెలుగొందుతూనే ఉంది. ఈ కథను పలు యూనివర్సిటీలు పాఠ్యాంశంగానూ నెలకొల్పిన సందర్భాలున్నాయి. ఈ కథ ఆధారంగా ప్రముఖ హిందీ బెంగాలీ చిత్ర దర్శకులు బిమల్ రాయ్, లీలా దేశాయ్ తో కలిసి కాబులీవాలా చిత్రాన్ని హిందీలో నిర్మించారు. ఈ చిత్రానికి హేమేన్ గుప్త దర్శకత్వం వహించారు. ఇందులో కాబులీవాలాగా బలరాజ్ సహానీ నటించారు. 1961 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం కాబులీవాలా పాఠకులను అలరించినట్టుగానే, ప్రేక్షకులనూ ఆకట్టుకుంది.
Read Also: 20 ఏళ్ల ‘కభీ ఖుషి కభీ ఘమ్`
కాబులీవాలా కథ విషయానికి వస్తే – ఆఫ్ఘనిస్థాన్ నుండి అబ్దుల్ రహ్మాన్ ఖాన్ అనే పండ్ల వ్యాపారి కలకత్తా వచ్చి, వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అతనికి మిని అనే ఓ చిన్నారి పాప పరిచయం అవుతుంది. అతనివద్ద ఆమె పండ్లు కొనుగోలు చేయడం, అతను ఆమెకు ప్రేమతో మరిన్ని పండ్లు ఇవ్వడం చేస్తూంటాడు. మినిని చూస్తే అతనికి తన కూతురు గుర్తుకు వస్తూవుంటుంది. మినీని సరదాగా నువ్వు ఎప్పుడు అత్తారింటికి వెళ్లావు అని అడుగుతూ ఉంటాడు ఆ కాబులీవాలా. ఓ సారి అతని కూతురుకు అనారోగ్యం అని టెలిగ్రామ్ వస్తుంది. దాంతో తన వ్యాపారం మొత్తం అమ్మేసి సొంతవూరికి వెళ్ళాలని భావిస్తాడు. ఆ అమ్మకం జరిగిన తరువాత రావలసిన పైకంవద్ద ఓ వ్యక్తితో పేచీవస్తుంది. తాను దేనినైనా సహిస్తానని, మోసాన్ని భరించలేనని చెబుతాడు కాబులీవాలా. గొడవలో ఒకడి ప్రాణం పోతుంది. కోర్టులో కాబులివాలా లాయర్ అతణ్ణి కాపాడాలని పలు అబద్ధాలు చెబుతాడు. అయితే నిజాయితీ పరుడైన కాబులీవాలా ఉన్న విషయం చెబుతాడు. అతని నిజాయితీ మెచ్చిన జడ్జి పది సంవత్సరాలు శిక్ష విధిస్తాడు. శిక్ష పూర్తి చేసుకున్న కాబులీవాలా రహ్మాన్ మినీని చూడటానికి వస్తాడు. ఈ పదేళ్ళలో మినీ పెద్దదై , అదే రోజున ఆమె పెళ్ళి జరుగుతూ ఉంటుంది. మినీ తండ్రి, కాబులీవాలాను ఆమెకు చూపిస్తాడు. గుర్తుచేస్తాడు. కానీ, ఆమె గుర్తు పట్టలేదు. దాంతో రహ్మాన్ తన సొంత కూతురు కూడా తనను గుర్తుపట్టలేదు కదా అనుకుంటాడు. మినీ తండ్రి కాబులీవాలాకు కొంత సొమ్ము ఇచ్చి ఆఫ్ఘనిస్థాన్ చేరుకోమని, కుటుంబంతో హాయిగా ఉండమని చెబుతాడు. మినీ కూడా కాబులీవాలా కూతురుకు ఓ బహుమతి పంపుతుంది. కాబులీవాలా తన స్వస్థలం వెళ్తూ ఉండడంతో కథ ముగుస్తుంది.
నిజాయితీ నీడలు వెదికే మనిషి బ్రతుకు ధన్యం అన్నారు. కాబులీవాలా తాను చేసిన నేరాన్ని నిజాయితీగా అంగీకరించడం వల్లే అతనికి శిక్ష తగ్గుతుంది. చివరకు మేలు జరుగుతుంది. ఈ నీతిని బోధించిన ఈ కథ ఈ నాటికీ ఎంతోమంది పిన్నలను, పెద్దలను ఆకట్టుకుంటూనే ఉంది. కాబులీవాలా చిత్రంలో రహ్మాన్ గా బలరాజ్ సహానీ అభినయం అలరించింది. మినీగా సోనూ నటించగా, మిగిలిన పాత్రల్లో ఉషాకిరణ్, పద్మ, లక్ష్మి, సరితా దేవి, బేబీ ఫరిదా, అసిత్ సేన్ కనిపించారు. ఈ చిత్రానికి సలీల్ చౌదరి సంగీతం ప్రాణం పోసింది. ప్రేమ్ ధవన్, గుల్జార్ పాటలు రాశారు. ఇందులోని ఆయ్ మేరే ప్యారే వతన్...
, గంగా ఆయీ కహా సే...
, కాబులీవాలా...
, యే యా ఖుర్బాన్...
అంటూ సాగే పాటలు అలరించాయి.