“వింటే భారతం వినాలి… తింటే గారెలే తినాలి…” అని నానుడి. రామాయణ, భారత, భాగవతాలు మన భారతీయులకు పవిత్రగ్రంథాలు. ఈ పురాణగాథల ఆధారంగానే భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రాణం పోసుకోవడం విశేషం! తరువాతి రోజుల్లో భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగులో రూపొందిన యన్టీఆర్ పౌరాణికాలు ఇతర భాషల్లోకి అనువాదమై అలరించాయి. భారతగాథకు అసలైన నాయకుడు అనిపించే భీష్ముని గాథతో తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రంలో యన్టీఆర్ కథానాయక పాత్ర పోషించారు. నాలుగు తరాలు చూసిన కురువృద్ధుడు భీష్మునిగా యన్టీఆర్ తెరపై అభినయించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ‘భీష్మ’ చిత్రంలో నటించే సమయానికి యన్టీఆర్ వయసు కేవలం 39 సంవత్సరాలు. ఆ వయసులో పండుముసలిగా రామారావు ప్రదర్శించిన నటనాకౌశలం భావితరాలకు స్ఫూర్తిగా నిలచింది. ప్రముఖ దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావు తమ ‘బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కించిన ‘భీష్మ’ 1962 ఏప్రిల్ 19న జనం ముందు నిలచింది, జేజేలు అందుకుంది.
మహాభారతంలోని భీష్ముని గాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేవుడు అనే సత్యాన్ని అన్వేషించేవారే అసలైన హేతువాదులు అన్నారు. నిజజీవితంలో హేతువాదులుగా పేరొందిన తాపీ ధర్మారావు, ఆరుద్ర ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. తాపీ ధర్మారావు పలికించిన సంభాషణలు, ఆరుద్ర అందించిన గీతాలు ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి.
భూలోకంలో సుప్రసిద్ధమైన కురువంశం కునారిల్లి పోకుండా ఆ వంశగాథ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని బ్రహ్మదేవుడు భావించడం- అందు నిమిత్తమై బ్రహ్మలోకంలో ఉన్న మహాభిష, అక్కడకే వచ్చిన గంగాదేవికి శాపమిచ్చి భూలోకానికి పంపుతాడు బ్రహ్మ. కురువంశంలో భీష్మజననం కోసం ఈ దేవతామూర్తులకు శాపం కలిగించినట్టు సరస్వతీదేవికి చెబుతాడు బ్రహ్మ. అదే సమయంలో వశిష్ఠ శాపగ్రస్తులైన అష్టవసువులతో నారదుడు, గంగాదేవిని కలుసుకుంటాడు. వశిష్ఠ మహాముని కామధేనువును అష్టవసువులు దురాశతో అపహరించబోగా, ఆయన ఇచ్చిన శాపఫలాన వారు భూలోకంలో మానవులై జన్మించవలసి ఉంటుంది. అందువల్ల పవిత్రమైన గంగ గర్భమున జన్మించిన తమ శాపవిమోచన కలుగుతుందని వసువులు ఆశిస్తారు. తల్లిగా తన ముచ్చట తీర్చుకొనే అవకాశం లేదా అంటే, చివరగా జన్మించే ప్రభాసునితో ఆ కోరిక తీరుతుందని నారదుడు సెలవిస్తాడు. బ్రహ్మశాపవశాన కురువంశంలో శంతనునిగా జన్మించిన మహాభిషను గంగాదేవి కలుసుకుంటుంది. ఆమెను చూడగానే మోహిస్తాడు శంతనుడు. అయితే తన మాటకు ఏ నాడూ అడ్డు చెప్పరాదన్న నిబంధన విధిస్తుంది. అంగీకరించిన శంతనుణ్ణి చేరుతుంది. ఆమె తనకు పుట్టిన బిడ్డలను నీటిపాలు చేస్తూ ఉండడం శంతనుడు ఇచ్చిన మాటకోసం సహిస్తాడు. చివరగా ఆమెను వారిస్తాడు. దాంతో తనయుడిని పెంచి పెద్ద చేసి, శంతనునికి అప్పగించి గంగ నిష్క్రమిస్తుంది. గాంగేయుడు మహావీరునిగా జేజేలు అందుకుంటాడు. గురువు పరశురామునే మించిన శిష్యుడు అనిపించుకుంటాడు. తండ్రి శంతనుడు మశ్చగంధిపై మనసు పడ్డాడని తెలుసుకొని, ఆమె తన తండ్రిని పెళ్ళాడేందుకు తాను ఏనాడూ రాజ్యం చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో దేవవ్రతుడు కాస్తా భీష్మునిగా చెలామణీ అవుతాడు. తన తమ్ములు విచిత్రవీర్యుని కోసం అంబ, అంబిక,అంబాలికను తీసుకు వస్తాడు. అందులో అంబ అప్పటికే సాల్వరాజును ప్రేమించి ఉంటుంది. ఆమె మనసు తెలిసి భీష్ముడు అంబను సాల్వుని వద్దకే పంపుతాడు. అయితే తనను ఓడించి, భీష్ముడు వశం చేసుకున్న అంబను తాను పెళ్ళాడలేనని చెబుతాడు సాల్వుడు. తిరిగి వచ్చి తనను గ్రహించమంటుంది అంబ. అందుకు భీష్ముడు తాను ప్రతిన చేసిన కారణంగా ఆ పని చేయలేనని చెబుతాడు. కోపించిన అంబ నిష్టతో తపస్సు చేసి పరమేశుని అనుగ్రహాన ద్రుపదుని ఇంట శిఖండిగా జన్మిస్తుంది.
విచిత్రవీర్యుని మరణంతో అంబిక, అంబాలికకు వేదవ్యాసుని వలన దృతరాష్ట్రుడు, పాండురాజు జన్మిస్తారు. వారి పిల్లలయిన శత కౌరవులు, పంచపాండవులు తరచూ కలహించుకుంటూ ఉంటారు. వారిని ఒక్కటిగా ఉంచాలన్నదే భీష్ముని అభిలాష. జూదంలో ఓడిన పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకొని, తమకు ఐదూళ్ళు ఇచ్చిన చాలని శ్రీకృష్ణునితో రాయబారం పంపుతారు. అందుకు దుర్యోధనుడు అంగీకరించడు. దాంతో కురుక్షేత్రంలో కౌరవ,పాండవులు యుద్ధానికి దిగుతారు. భీష్ముడు సేనాధిపతిగా కౌరవులు, ద్రుష్టదుమ్నుని ఆధిపత్యంలో పాండవులు యుద్ధం సాగిస్తారు. భీష్ముని దాటికి అర్జునుడు తల్లడిల్లి పోతాడు. భీష్మునిపై పగతో శిఖండిగా జన్మించిన ఆమెను అడ్డు పెట్టుకొని భీష్ముని నేలకూలుస్తారు. తాను కోరుకున్న సమయంలోనే మరణించే వరం కలిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో విష్ణువులో ఐక్యమవ్వడంతో కథ ముగుస్తుంది.
భారతగాథను మన పిల్లలకు బోధపడేలా చేసేందుకు ఉపయోగపడే చిత్రాలు తెలుగులోనే అధికంగా ఉన్నాయి. వాటిలో ముందుగా ‘భీష్మ’ చిత్రాన్ని పరిచయం చేస్తే, దాదాపుగా సగం భారతం తెలిసినట్టే అని పెద్దలు అన్నారు. తరువాత యన్టీఆర్ నటించిన “శ్రీక్రిష్ణ పాండవీయం, పాండవవనవాసము, నర్తనశాల, దానవీరశూరకర్ణ, ప్రమీలార్జునీయం” వరుసగా చూపించి తీరాలనీ పెద్దలు చెబుతారు. ఇక ఈ ‘భీష్మ’ చిత్రంలో
అంబగా, శిఖండిగా అంజలీదేవి నటించారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, రేలంగి, హరనాథ్, శోభన్ బాబు, గుమ్మడ, నాగభూషణం, ధూళిపాల, సత్యనారాయణ, వంగర, సీఎస్సార్, పేకేటి శివరామ్, మల్లాది, ఏవీ సుబ్బారావు, ఏవీ సుబ్బారావు జూనియర్, సూర్యకాంతం, జి.వరలక్ష్మి, సుజాత, అనురాధ, మీనా కుమారి, సుశీల, మల్లీశ్వరి, నిర్మలమ్మ ఇతర పాత్రధారులు.
సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన “బ్రహ్మదేవ సుత భాగ్యవిధాత…”, “తెలియగలేరే నీ లీలలు…”, “జో జో జోలా…” , “హైలో హైలెస్సా హంసకదా నా పడవా…”, “మనసులోని కోరిక…”, “మహాదేవ శంభో…”, “మాధవా… మాధవా…”, “నమో త్యాగచరిత…” వంటి పాటలు అలరించాయి. వీటిలో కొన్ని పద్యాలు సైతం విశేషాదరణ చూరగొన్నాయి.
అప్పటికే సూపర్ స్టార్ గా కొనసాగుతున్న యన్టీఆర్ ఈ పౌరాణిక చిత్రంలో ముదుసలి పాత్రలో నటించడమే ఓ సాహసం. ఇందులో ఆయనకు నాయికగానీ, పాటలు కానీ లేవు. అయినప్పటికీ ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. శతదినోత్సవాలు చూసింది. రిపీట్ రన్స్ లో విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రంలో దుర్యోధన పాత్ర ధరించిన ధూళిపాలకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అంతకు ముందు యన్టీఆర్ తెరకెక్కించి, నటించిన ‘సీతారామకళ్యాణం’లో శ్రీరామునిగా నటించిన హరనాథ్ కు ఇందులో శ్రీకృష్ణ పాత్ర లభించింది. కర్ణునిగా గుమ్మడి, అర్జునునిగా శోభన్ బాబు అభినయించారు. అంతకు ముందు బి.ఏ.సుబ్బారావు తెరకెక్కించిన ‘చెంచులక్ష్మి’లో నారద పాత్ర పోషించిన రేలంగి, ఇందులోనూ అదే పాత్రలో అలరించారు. అందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారనే చెప్పాలి. మహానటుడు యన్టీఆర్ నటజీవితంలో ఓ మరపురాని పౌరాణికంగా ‘భీష్మ’ నిలచింది.