టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన తెలుగు యాక్షన్ అండ్ సోషల్ మెసేజ్ డ్రామా ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. శ్రీమంతుడు సినిమా 7 ఆగష్టు 2015న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ సాధించిన చిత్రాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .200 కోట్లు సంపాదించింది. “శ్రీమంతుడు” చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
Read Also : ఒత్తిడితో ఆసుపత్రి పాలైన బాలీవుడ్ నటి!
రవి (జగపతి బాబు) అనే బిజినెస్ టైకూన్ కొడుకు హర్షవర్ధన్ (మహేష్ బాబు). తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకొమ్మంటే హర్ష మాత్రం వాయిదా వేస్తూ ఉంటాడు. దేవరపల్లి నుండి సిటీకి వచ్చి రూరల్ డెవలప్ మెంట్ కోర్సు చదువుతూ ఉంటుంది చారుశీల. చారుశీల ( శృతి హాసన్ )ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పరిచయం ప్రేమగా మారే సమయానికి హర్ష, రవికాంత్ కొడుకని తెలిసి అతని ప్రేమను చారు తిరస్కరిస్తుంది. నీ తండ్రి ఊరేదో తెలుసా ? సొంత ఊరైన దేవరపల్లిని నీ తండ్రి పట్టించుకోలేదు. అందుకే నీకూ, నాకూ కుదరదని చెప్తుంది. దాంతో ఆలోచనలో పడ్డ హీరో పల్లెలో తమ కుటుంబం మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరుతాడు. ఆ ఊర్లో ఎంపీ తమ్ముడు శశి అరాచకాలు అరికట్టి హర్ష ఊరిని బాగుచేస్తాడు. చారు మనసు గెలుచుకొంటాడు. ఊరిని దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలూ సమకూరుస్తాడు. సినిమాలోని “ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతారు” అనే డైలాగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమా హిట్ కు దోహదం చేసింది. “జత కలిసే జత కలిసే, రాములోడు వచ్చినాడురో, పోరా శ్రీమంతుడా, జాగో జాగోరే జాగో, చారుశీల స్వప్న బాల, దిమ్మతిరిగే…” ఇలా అన్నీ సాంగ్ ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంలో నటిస్తున్నాడు.