తెలుగు చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు నమోదు చేసిన ఘనత నటరత్న యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ కే దక్కుతుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలిసారి తెరకెక్కించిన చిత్రం ‘అడవిరాముడు’. ఈ చిత్రంలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉండడం విశేషం! దర్శకత్వంలో రాణించాలనుకొనేవారికి పూర్తిగా అడవిలో రూపొందిన ‘అడవిరాముడు’ చిత్రం ఓ అధ్యయన అంశమనే చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై నలభై ఐదేళ్ళు అవుతున్నా, ఇంకా ‘అడవిరాముడు’ ఫార్ములానే అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు.
యన్టీఆర్ నటునిగా 29 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సమయమది. అప్పటికే అనితరసాధ్యంగా పౌరాణికాల్లో భగవంతుని పాత్రల్లోనూ, భక్తుల పాత్రల్లోనూ, ప్రతినాయకుడిగా విరుద్ధ భావాలున్న పాత్రల్లోనూ నందమూరి పరకాయప్రవేశం చేసి ఉన్నారు. ఇక జానపద చిత్రాల్లో తిరుగులేని రారాజు అనిపించారు. చారిత్రకాల్లో చరిత్రలోని పాత్రలే నడచివచ్చాయా అన్న స్ఫురద్రూపంతో రక్తికట్టించి ఉన్నారు. సాంఘికాల్లో సరేసరి, మహానటుడు- అందాలనటుడు అన్న పదాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారాయన. ఆ తరుణంలో 1977 ఏప్రిల్ 28న విడుదలయిన యన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం తెలుగు చిత్రజగత్తునే ఓ మలుపు తిప్పింది.
పలు ఫస్ట్ కాంబోస్…
యన్టీఆర్ కెరీర్ లో తొలి సినిమా స్కోప్-ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచింది. అలాగే యన్టీఆర్ తో కె.రాఘవేంద్రరావుకు తొలి చిత్రమిది. ఈ చిత్రంలోనే మొదటిసారి యన్టీఆర్ కు జంటగా జయప్రద నటించారు. తెలుగునాట స్టూడియో అవసరం లేకుండా రూపొందిన చిత్రమిదే కావడం విశేషం.
యన్టీఆర్ అంటే దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అమితాభిమానం. ఎందుకంటే యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పాండవవనవాసము’ (1965) చిత్రం ద్వారానే రాఘవేంద్రరావు అసోసియేట్ డైరెక్టర్ గా సినీ జీవితం ప్రారంభించారు. అప్పటి నుంచీ యన్టీఆర్ తో ఏ నాటికైనా సినిమా తీయాలని తపించేవారు రాఘవేంద్రరావు. శోభన్ బాబు ‘బాబు’ (1975) సినిమాతో దర్శకుడైన రాఘవేంద్రరావుకు ఆ తరువాత ‘జ్యోతి, కల్పన’ వంటి సినిమాలు రూపొందించారు. ఎలాగైనా యన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలనే ఆశించేవారు రాఘవేంద్రరావు. ఒకవేళ యన్టీఆర్ తో పనిచేసే అవకాశమే వస్తే, ఎలాంటి సినిమా అయితే బాగుంటుందో అని ఆయన ప్రణాళికలు వేసుకొనేవారు. ఆయన తపన గమనించి, ఆ దేవుడు వరమిచ్చినట్టుగా ‘అడవిరాముడు’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం లభించింది. అంతకు ముందు రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ సినిమాతోనే ‘సత్య చిత్ర’ సంస్థ మొదలయింది. ఆ చిత్రనిర్మాతలు సత్యనారాయణ,సూర్యనారాయణతో రాఘవేంద్రరావుకు సత్సంబంధాలు ఉండేవి. వారితో తరచూ యన్టీఆర్ తో సినిమా తీస్తే అలా తీస్తా, ఇలా తీస్తా అని చెప్పేవారు రాఘవేంద్రరావు. ఆయనలోని తపన చూసిన ఆ నిర్మాతలిద్దరూ యన్టీఆర్ కాల్ షీట్ ఇస్తే తప్పకుండా నువ్వనుకున్నట్టుగానే సినిమా తీద్దామన్నారు. ఆ అవకాశం రానే వచ్చింది. యన్టీఆర్ ను కొన్ని పౌరాణిక గెటప్స్ లో చూపించాలని భావించి, అదే తీరున “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు…” పాటలో వాల్మీకి, శ్రీరాముడు, ఏకలవ్యుని వంటి పౌరాణిక గెటప్స్ లో చూపించారు. ఆ సినిమాను పూర్తి చేసే రోజున యన్టీఆర్ శ్రీరాముని గెటప్ లో ఉండగా గుమ్మడి కాయ కొట్టడం మరింత విశేషం.
పాటల్లోనూ ప్రత్యేకత!
ఉన్నంతలో పాటలను అందంగా చిత్రీకరించడం రాఘవేంద్రరావు ప్రత్యేకత. ‘అడవిరాముడు’ ను ముందుగానే భారీ స్థాయిలో రూపొందించాలని భావించిన రాఘవేంద్రరావు ఇందులోని ప్రతి పాటను ఒక్కో పద్ధతిలో చిత్రీకరించాలని భావించారు. తొలి పాట “కృషి వుంటే మనుషులు ఋషులవుతారు…” పాటను సందేశాత్మకంగా రూపొందించారు. తరువాత “అమ్మతోడు అబ్బతోడు…” పాటలో కాసింత కొంటెతనాన్ని మిళితం చేసి, నాయికను ఆటపట్టించేలా తెరకెక్కించారు. ఈ పాటలో మూడు ఏనుగులు కూడా పాలుపంచుకోవడం విశేషం. ఇక మూడో పాట “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…”లో కాసింత శృంగారరసం చిలికింది. నాలుగో పాట “ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ…” ను చిత్రీకరించిన తీరు ఆ రోజుల్లో అబ్బుర పరచింది. ఈ నాటికీ తెలుగు చిత్రసీమలో ఈ తరహా గ్రూప్ సాంగ్ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఐదో గీతంగా రూపొందిన “కు కు కు కూ కోకిలమ్మ పెళ్ళికి…” అన్నదానిని తెరపై ఆవిష్కరించిన తీరు అందుకు గాను సంగీతదర్శకుడు కేవీ మహదేవన్ నుండి రాఘవేంద్రరావు రాబట్టిన స్వరకల్పన అద్భుతం అనిపిస్తుంది. యన్టీఆర్ మారు వేషాలకు పెట్టింది పేరు. దాంతో చివరలో వచ్చే “చూడర చూడర ఒక చూపు…” పాటలో రామారావుతో సులేమాన్ గా ఓ మారు వేషం వేయించారు. ఆ పాటలోనూ పెద్ద సంఖ్యలో ఏనుగులు పాల్గొనడం విశేషం. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటలన్నీ ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి.
పలువురికి విజయపథం…
‘అడవిరాముడు’ సాధించిన అరుదైన, అపురూపమైన విజయంతో ఈ చిత్రానికి పనిచేసిన వారిలో అనేకులు విజయపథంలో పరుగులు తీశారు. జయప్రద, జయసుధ ఈ చిత్రంద్వారా స్టార్ హీరోయిన్స్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు రాత్రికి రాత్రే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేరిపోయారు. ఈ చిత్రానికి రచన చేసిన జంధ్యాల టాప్ రైటర్ అయిపోయారు. తరువాతి రోజుల్లో డైరెక్టర్ గానూ మారారు. ఇక వేటూరి టాప్ లిరిసిస్టుగా పేరొందారు. సలీం స్టార్ డాన్స్ మాస్టర్ గా ఎదిగిపోయారు. అప్పట్లో మూసివేయాలి అనుకున్న లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ, ఈ చిత్ర విజయంతో ఆ తరువాత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులాగా ఎదిగి వీర విహారం చేసింది. ఇలా ఎందరో జీవితాలను మార్చివేసింది ఈ చిత్రం.
రికార్డుల పర్వం…
అప్పటి వరకు ఓ సినిమా విడుదలై అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడం అన్నది యన్టీఆర్ ‘లవకుశ’ (1963)కే ఉండేది. ఆ చిత్రం తొలి విడత 26 కేంద్రాలలో విడుదలై, అన్ని కేంద్రాలలోనూ శతదినోత్సవం జరుపుకుంది. ఆ పైన తరువాతి బ్యాచ్ లతో కలిపి ఆ సినిమా 72 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శితమైంది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది లవకుశ. మళ్ళీ అన్ని విధాలా ప్రదర్శితమైన పౌరాణిక చిత్రం మరొకటి కానరాలేదు.ఆ సినిమా తరువాత తొలివిడతలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘అడవిరాముడు’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం 32 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మలివిడతలో మరో ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం 16 కేంద్రాలలో రజతోత్సవం, 8 కేంద్రాలలో ద్విశతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో స్వర్ణోత్సవం జరుపుకుంది. తెలుగు సినిమాను పంపిణీ చేసే ప్రాంతాలయిన ఆంధ్ర, సీడెడ్(రాయలసీమ),నైజామ్(తెలంగాణ), ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఈ సినిమా స్వర్ణోత్సవం ఆడడం విశేషం. ఆంధ్రలో విజయవాడ, సీడెడ్ లో కర్నూలు, నైజామ్ లో హైదరాబాద్, ఉత్తరాంధ్రలో వైజాగ్ లోనూ ఈ సినిమా 365 రోజులు ప్రదర్శితమై ఈ నాటికీ ఈ నాలుగు ప్రాంతాల్లో ఒకేసారి స్వర్ణోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచే ఉంది.
వసూళ్ళ పర్వం…
ఈ చిత్రం ఆ రోజుల్లో రూ.4 కోట్లు వసూలు చేసింది. ఈ మొత్తాన్ని ప్రస్తుత గణాంకాలకు అన్వయిస్తే, దాదాపు ఏడెనిమిది వందల కోట్లతో సమానమని గణాంక నిపుణుల అంచనా! అంటే ఈ నాటి ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘బాహుబలి – ద కంక్లూజన్’ కంటే అధికం. ‘బాహుబలి’ తెలుగు వర్షన్ వసూళ్లు రూ.300 కోట్ల పైగా అని చెబుతున్నారు. ఇక ‘అడవిరాముడు’ ఆ తరువాత రిపీట్ రన్స్ లోనూ చరిత్ర సృష్టించింది. అప్పుడు కూడా కనకవర్షం కురిపించింది. ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహాయిస్తే ఈ చిత్రం మొత్తం షూటింగ్ మధుమలై అడవిలో జరిగింది. దాదాపు మూడువందలమంది షూటింగ్ లో పాల్గొన్నారు. వారందరికీ కూడా అడవిలోనే మకాం ఏర్పాటు చేయడమంటే మాటలు కాదు. ఇక ఈ చిత్రంలో జంతువులతోనూ తగిన నటన రాబట్టుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రోజుల్లో దక్షిణాదిన నంబర్ వన్ చిత్రంగా నిలచిన ‘అడవిరాముడు’ నలభై ఐదేళ్ళయిన తరువాత కూడా ఈ నాటికీ బుల్లితెరపై సందడి చేస్తూనే అక్కడక్కడా థియేటర్లలోనూ సందడి చేస్తూ ఉండడం గమనార్హం.
ఈ చిత్రంలోని కథ, కథనం అక్కడ కొంత, ఇక్కడ కొంత ఎత్తుకొని వచ్చి వండినదే. అందుకే ఓ సీన్ లో జంధ్యాల ఈ కథను దృష్టిలో పెట్టుకొనే ‘ఆల్ కూర చమ్ చమ్’ అనే మాట ఉపయోగించారు. అదే తీరున ఈ నాటికీ తెలుగు చిత్రసీమ ‘అడవిరాముడు’ ఫార్ములాతో ఆల్ కూర చమ్ చమ్ లను తయారు చేస్తూనే ఉంది.