మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ తనను అభిమానించేవారిని ఆనందపరచడం కోసం శ్రమిస్తుంటారు. 1995లో ఆయన సినిమాలు నిరాశ కలిగించాయి. ఆ సమయంలో ఆయన కాసింత గ్యాప్ తీసుకొని మళ్ళీ 1997 నుండి తనదైన బాణీ పలికిస్తూ అభిమానులను అలరించారు. తొలుత ‘హిట్లర్’గా, తరువాత ‘మాస్టర్’గా మురిపించిన మెగాస్టార్ ఆ పై టైటిల్ రోల్ కాకుండా, కథకు సంబంధించిన టైటిల్స్ తో సాగాలని తలచారు. ఆ ప్రయత్నంలో తొలిగా రూపొందిన చిత్రం ‘బావగారూ…బాగున్నారా?’. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తమ్ముడు నాగబాబు నిర్మించారు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం…రా’తో పరిచయం అయిన జయంత్ కు ఇది రెండవ చిత్రం! 1998 ఏప్రిల్ 9న విడుదలైన ‘బావగారూ…బాగున్నారా’ భలేగా అలరించింది.
Read Also:Israel: ఇజ్రాయిల్ పై సిరియా దాడి.. సరిహద్దు దేశాల నుంచి వరస దాడులు..
ఇంతకూ ‘బావగారూ…బాగున్నారా’ కథ ఏమిటంటే- భారతీయుడైన రాజు న్యూజీలాండ్ లో ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. స్వదేశంలో తన చెల్లెలు పేరున ఓ అనాథశరణాలయం కూడా నిర్వహిస్తూంటాడు రాజు. స్వప్న అనే అమ్మాయి న్యూజిలాండ్ లో చదువుకుంటూ, ఆమె అంకుల్ ఇంట్లో ఉంటుంది. ఓ సందర్భంలో రాజుతో స్వప్నకు పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. తరువాత ఇండియాలో రైలులో ప్రయాణం చేస్తోన్న రాజుకు ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను రైల్వే పోలీసులు నా నా ప్రశ్నలు వేస్తూ ఉంటే, రాజు తెలివిగా వారి బారి నుండి కాపాడేందుకు తన భార్య అని చెబుతాడు. ఆ పై ఆమె గురించి వివరాలు తెలుసుకుంటాడు. ఆమె పేరు సంధ్య. ప్రియుడు మోసం చేయడంతో గర్భవతి అయిన సంధ్య మరణించాలను కుంటుంది. కడుపులోని బిడ్డకోసం ఆ ప్రయత్నం విరమిస్తుంది.
Read Also: Shama Sikander: బీచ్.. బికినీ.. షామా.. చూపించడమే పని
ఆమె ఇంట్లోవాళ్ళకు తానే సంధ్య భర్తనని చెబుతాడు రాజు. కేవలం ఆమె కడుపులోని బిడ్డను రక్షించడానికే రాజు ఇలా చేస్తాడు. తరువాత అతని మంచితనంతో ఆమె ఇంట్లోవాళ్ళను ఆకట్టుకుంటాడు. చిత్రమేమిటంటే, ఈ సంధ్య, రాజును ప్రేమించిన స్వప్న అక్కయ్యే! సంధ్య తండ్రి ఊరి వారికి, పొరుగు వారి వల్ల ఓ సమస్య వస్తుంది. దానిని రాజు పరిష్కరిస్తాడు. దాంతో సంధ్య ఇంట్లోవాళ్ళు రాజును తన అల్లునిగా అంగీకరిస్తారు. కానీ, ఆమె నాన్న మాత్రం తాము గొప్పవంశానికి చెందినవారమని గర్వంతో ఉంటాడు. స్వప్నకు రాజు అసలు విషయం చెబుతాడు. సంధ్య మరోమారు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది. రాజు మళ్ళీ ఆదుకుంటాడు. కారణమేమిటంటే, ఆమె ప్రేమించినవాడిని కలుసుకోవడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
రాజు, స్వప్న ప్రేమించుకున్నారన్న విషయం ఆ ఇంటి పెద్ద కు తెలుస్తుంది. ఆయన తన కొడుక్కుతప్ప ఇంట్లోవాళ్ళకు ఈ విషయం చెబుతాడు. స్వప్న తండ్రికి ప్రత్యర్థుల వల్ల ఈ విషయాలు తెలుస్తాయి. తనకు తెలియకుండా ఇంట్లో ఇన్ని జరుగుతున్నాయని తెలుసుకొని ఆత్మహత్యకు పాల్పడతాడు సంధ్య తండ్రి. కానీ, రాజు వెళ్ళి ఆయనను రక్షిస్తాడు. ఇన్నాళ్ళు గొప్పవంశంలో పుట్టడం గొప్ప అనుకున్నానని, కానీ మంచిమనసు ఉండడమే అసలైన గొప్ప అని సంధ్య తండ్రి అంటాడు. పెద్దకూతురు క్షమించమంటుంది. ఆమె ప్రియునితో ఆమెను కలుపుతాడు. రాజు, స్వప్న పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
చిరంజీవి సరసన రంభ నాయికగా నటించిన ఈ చిత్రంలో రచన, అచ్యుత్, సత్యనారాయణ, బ్రహ్మానందం, షావుకారు జానకి, పరేశ్ రావెల్, కోట శ్రీనివాసరావు, శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి, సుధ, ఎమ్మెస్ నారాయణ నటించారు. “సారీ సారీ…” అంటూ సాగే పాటలో నిర్మాత నాగబాబు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరకల్పన చేయగా, సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాశారు. “ఆంటీ కూతురా అమ్మో అప్సరా…”, “సారీ సారీ.. అంటుందోయ్ కుమారి…”, “చల్నేదో గాడీ…”, “మత్తెక్కి తూగే…”, “నవమి దశమి…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ చిత్రంలో ఓ నన్నివేశానికి తగ్గట్టు చిరంజీవి ‘బంజీ జంప్’ చేయడం ఆ రోజుల్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. ఈ సినిమా వినోదం పండిస్తూ మంచి విజయాన్ని మూటకట్టుకుంది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఈ సినిమాకు ‘ఏ వాక్ ఇన్ క్లౌడ్స్’ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా పేర్కొన్నారు. కానీ, ఇందులోని ప్రధానాంశాలు రెండు – ఒకటి గర్భవతియై చనిపోతున్న అమ్మాయిని హీరో రక్షించడం, ఆమె బిడ్డ కోసం ఆమె భర్తగా నటించడం. తరువాత ఆ అమ్మాయి తన ప్రేయసికి అక్క అని తెలియడం. ఈ రెండు అంశాలు అంతకు ముందు వచ్చిన కొన్ని తెలుగు చిత్రాలను పోలి ఉన్నాయి. యన్టీఆర్ ‘మనుషుల్లో దేవుడు’లో ప్రేమించిన అమ్మాయి అక్కనే కారణాంతాల వల్ల హీరో పెళ్లిచేసుకోవడం, ఆ తరువాత హీరోయిన్ వచ్చాక అసలు విషయం తెలియడం జరుగుతుంది. ఇక ఏయన్నార్ ‘మహాత్ముడు’లో మోసపోయి, చనిపోవాలనుకున్న ఆమెను రక్షించి, ఆమెకు భర్తగా నటించడం ఉంటుంది. అందువల్ల తెలుగువారు ఇంగ్లిష్ సినిమాను తలచుకోలేదు కానీ, ‘బావగారూ…బాగున్నారా’ చూశాక ఈ పాత చిత్రాలను గుర్తు చేసుకున్నారు. తరువాత హిందీలో ‘కున్వారా’ పేరుతోనూ, బంగ్లాదేశ్ లో ‘జమై షషుర్’గానూ ‘బావగారూ…బాగున్నారా’ రీమేక్ అయింది.
Read Also: Tarun Chugh: యుద్ద గుర్రాలుగా మారండి..