ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొప్పించేవారు. అందువల్లే ఎస్వీకే సినిమాను చూడటానికి అప్పట్లో ఆబాలగోపాలం పరుగులు తీసేవారు. పాతికేళ్ళ క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆహ్వానం’ కూడా జనాన్ని అలాగే అలరించింది. 1997 మే 2న ‘ఆహ్వానం’ చిత్రం విడుదలయింది, జనాదరణ పొందింది.
‘ఆహ్వానం’ కథ విషయానికి వస్తే – రవికుమార్ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆశిస్తూ ఉంటాడు. బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ధనవంతుడు కావచ్చునని భావిస్తాడు. ఓ ఇంటిలో పనివాడిగా చేరి, ఆ ఇంటి యజమానిని, ఆ తరువాత ఆయన కూతురు రాజేశ్వరిని తన పనితనంతో మెప్పిస్తాడు. రవికుమార్, రాజేశ్వరికి పెళ్ళవుతుంది. హాయిగా కాపురం సాగుతూ ఉంటుంది. శిరీష అనే మరింత ధనవంతురాలయిన అమ్మాయి రవి జీవితంలో తారసపడుతుంది. దాంతో ఆమెను పెళ్ళాడితే, మరింత ధనవంతుడినవుతానని భావిస్తాడు. అందుకు భార్యను విడాకులు ఇవ్వమంటాడు. ఆమె సరేనంటుంది. అందుకు రవి కన్నవారు, రాజేశ్వరి తల్లిదండ్రులు అంగీకరించరు. కోర్టులో మంగళసూత్రం కట్టిన భర్తనే తన మెడలోని తాళిని విప్పమంటుంది. తన పెళ్ళి ఎంత శాస్త్రోక్తంగా జరిగిందో, విడాకులు కూడా అదే పంథాలో జరగాలని కోర్టుని కోరుతుంది రాజేశ్వరి. అందుకు రవి అంగీకరిస్తాడు. వినూత్న రీతిలో విడాకులకు ఆహ్వానం పలుకుతారు. పీటలపై కూర్చుని తాళి విప్పమని రాజేశ్వరి అంటుంది. ముందుకు పోయిన రవికి ఆమెలో ఓ దేవత కనిపిస్తుంది. దాంతో మనసు మార్చుకుని, “నేను వేసిన మూడుముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి, నా కళ్ళు తెరిపించావ్… క్షమించమని” కోరతాడు. ఈ విషయమంతా తెలిసి, ముందుగానే దండలు తెచ్చిన శిరీష వారితో దండలు మార్పించడంతో కథ సుఖాంతమవుతుంది.
విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్.వి. కృష్ణారెడ్డి నిర్వహించారు. సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “లక్ష్మీ కళ్యాణ వైభోగమే…”, “దేవతలారా రండి…”, “పందిరి వేసిన ఆకాశానికి…”, “హాయ్ హాయ్ నాయిక…”, “శ్రీరస్తు శుభమస్తు…”, “నీ మనసులోని మాట…”, “మిన్సారే మిన్సారే…” అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. దివాకర్ బాబు రచన చేశారు.
శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా రాజగోపాల్, సత్యనారాయణ, సాక్షి రంగారావు, నిర్మలమ్మ, గిరిబాబు, శివపార్వతి, డబ్బింగ్ జానకి, వై.విజయ, ఆలపాటి లక్ష్మి, ఆలీ, చలపతిరావు, యమ్. బాలయ్య, బండ్ల గణేశ్, ఝాన్సీ తదితరులు నటించారు.
ఆ రోజుల్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, మరో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ నడుమ ఆరోగ్యవంతమైన పోటీ ఉండేది. ఇద్దరూ పోటీలు పడి చిత్రాలు తీసి వినోదంతో జనాన్ని ఆకట్టుకొనేవారు. ఇద్దరూ మంగళసూత్రం పవిత్రతను తెలుపుతూ శ్రీకాంత్ హీరోగానే చిత్రాలు రూపొందించడం, అవి రెండూ ఒకే సంవత్సరం విడుదల కావడం విశేషం! శ్రీకాంత్ తో ఇ.వి.వి. తీసిన ‘తాళి’ 1997 జనవరి లో జనం ముందుకు రాగా, ఎస్వీకె ఆ హీరోతోనే తెరకెక్కించిన ‘ఆహ్వానం’ మేలో ప్రేక్షకులను పలకరించింది. విజయం సాధించింది.