20 Years Of Avunu Valliddaru Ista Paddaru:
వైవిధ్యమైన చిత్రాలతో జనాన్ని విశేషంగా అలరించారు దర్శకుడు వంశీ. ఆయన సినిమాల జయాపజయాలతో అభిమానులకు సంబంధం లేదు. వంశీ నుండి ఓ సినిమా వస్తోందంటే ఆ రోజుల్లో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అభిమానులు ఆశించినట్టుగా కొన్నిసార్లు వారిని విశేషంగా అలరించేలా వంశీ చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ‘ఏప్రిల్ 1 విడుదల’ తరువాత వంశీ నుండి ఒక్క హిట్ మూవీ కూడా రాలేదు. వచ్చినవన్నీ అందరినీ మెప్పించలేక పోయాయి. ఓ అరడజను పరాజయాలు పలకరించాయి. దాంతో ఓ నాలుగేళ్ళు గ్యాప్ తీసుకున్నారు వంశీ. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’. ఈ సినిమా 2002 ఆగస్టు 2న జనం ముందు నిలచింది. జయకేతనం ఎగరేసింది.
‘ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా ఫక్తు వంశీ మార్కు చిత్రం. కథను మరీ శల్య పరీక్ష చేయరాదు. సన్నివేశాలను భూతద్దం వేసి చూడరాదు. వంశీ నుండి ప్రేక్షకులు కోరుకున్న వినోదం సమపాళ్ళలో భలేగా పండింది. ఇంతకూ కథేమిటంటే.. వంద ఇంటర్వ్యూలు చూసిన మోరంపూడి అనిల్ కుమార్ అనే యువకుడు ఏ పని అయినా చేయడానికి సిద్ధమవుతాడు. అతని హుషారు చూసిన ఓ యజమాని నైట్ వాచ్ మన్ గా ఉద్యోగం ఇస్తాడు. ఇంటివేటలో పడతాడు అనిల్. అతనికి సత్యానందం అనే వ్యక్తి దొరుకుతాడు. ఒకే ఇంటిపై రెండు అద్దెలు లాగవచ్చుననే కాన్సెప్ట్ తో స్వాతి అనే ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి ఉండే ఇంటిని, ఉదయం పూట పది నుండి సాయంత్రం ఆరు లోగా ఉండే ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం స్వాతికి కూడా తెలియదు. అలా ఓ నెల గడుస్తుంది. ఓ రోజు అనుకోకుండా స్వాతి వస్తువు అనిల్ పగల గొడతాడు. దాంతో ఆమెకు క్షమాపణ పత్రం రాస్తాడు. ఆ లేఖలో అనిల్ నిజాయితీ, స్వాతికి నచ్చుతుంది. సరే తనకు ఇబ్బంది కలుగకుండా ఉంటున్నాడు కదా అనుకుంటుంది. దాంతో ఒకరినొకరు చూసుకోకుండా కేవలం లేఖల్లో అనిల్, స్వాతి పలకరించుకుంటూ ఉంటారు. తత్ప్రాభవంగా వారి మధ్య అనురాగం కూడా చిగురిస్తుంది. స్వాతిని ఒకసారి ప్రత్యక్షంగా చూస్తాడు అనిల్.
కానీ ఆమెకు మాత్రం ఇతనే తన రూంలో ఉండే వ్యక్తి అని తెలియదు. అలా వారి పరిచయం స్నేహంగా మారుతుంది. స్వాతి పనిచేసే ఆఫీస్ యజమాని కొడుకు ఆమెను చూసి, పెళ్ళాడతానంటాడు. అదే సమయంలో స్వాతికి, అనిల్ తన రూమ్మేట్ ఒక్కరే అని తెలుస్తుంది. ఓ ధనవంతుని భార్య అయితే స్వాతి సుఖంగా ఉంటుందని అనిల్ భావిస్తాడు. దాంతో తాను కూడా ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్ళాడబోతున్నానని అబద్ధం చెబుతాడు. అలా చెబితే ఆమె ఆనందంగా వాళ్ళ యజమాని కొడుకును పెళ్ళాడుతుందని భావిస్తాడు. చివరలో అనిల్ మిత్రుని కారణంగా స్వాతిని అనిల్ ప్రేమిస్తున్నాడని పెళ్ళికొడుక్కి తెలుస్తుంది. ఇద్దరు ప్రేమించుకున్నవారు విడిపోతే వారెంత బాధపడతారో తనకు తెలుసునని పెళ్ళికొడుకు అంటాడు. చివరకు స్వాతి, అనిల్ పెళ్ళి కావడానికి అతనే కారణమవుతాడు. అందరూ ఆనందించడంతో కథ ముగుస్తుంది.
రవితేజ, కళ్యాణి జంటగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు, బెనర్జీ, శివారెడ్డి, ప్రీతి నిగమ్, జీవా, ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు, సూర్య తదితరులు అభినయించారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూర్చారు. సిరివెన్నెల, సాయిశ్రీహర్ష, చంద్రబోస్, భాస్కరభట్ల పాటలు రాశారు. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘రా రమ్మని.. రారా రమ్మని’, ‘నాలో నేను లేనే లేను’, ‘పొగడమాకు అతిగా’, ‘సీతాకోక చిలుకా’, ‘ఎన్నెన్నో వర్ణాలు’, ‘మది నిండుగ మంచితనం’,’ఏమి ఈ భాగ్యమో’, ‘నూజివీడు సోనియా’ అంటూ సాగే పాటలు జనాన్ని అలరించాయి.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, మహర్షి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కథను విశ్వనాథ్ అందివ్వగా, వేమూరి సత్యనారాయణ స్క్రిప్ట్ కో -ఆర్డినేటర్ గా పనిచేశారు. శంకరమంచి పార్థసారథి మాటలు రాశారు. వల్లూరిపల్లి రమేశ్ నిర్మాత. ఈ చిత్రం వంశీ అభిమానులను మెప్పించి, మంచి విజయం సాధించింది. ఉత్తమ నటిగా కళ్యాణికి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా గణపతికి నంది అవార్డులు లభించాయి.
(ఆగస్టు 2న ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’కు 20 ఏళ్ళు)