పేరులో డర్టీ నింపుకున్నా ‘ద డర్టీ పిక్చర్’కు జనం జేజేలు పలికారు. ఇక జాతీయ స్థాయిలో అవార్డులూ ఈ చిత్రాన్ని వరించాయి. మన శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ ‘డర్టీ పిక్చర్’ తెరకెక్కడం విశేషం! ఈ చిత్రంలోని కథావస్తువు కన్నా మిన్నగా, టైటిల్ కంటే రెట్టింపుగా ఈ మూవీ పబ్లిసిటీలో ‘డర్టీ ట్రిక్స్’ ప్లే చేశారు నిర్మాత ఏక్తా కపూర్. ఆమె పబ్లిసిటీ స్టంట్ ‘ద డర్టీ పిక్చర్’కు ఎక్కడలేని క్రేజ్ ను సంపాదించి పెట్టింది. దాంతో అనూహ్య విజయం సొంతమయింది.
కథ విషయానికి వస్తే – తెలుగునాట జన్మించిన సిల్క్ స్మిత అనుమానస్పద మరణం, ఇప్పటికీ జనానికి ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. అదే తీరున ఆమె జీవితంలోని కొన్ని కోణాలు, ఆమె దుడుకు స్వభావం స్మిత ఆత్మహత్యకు కారణమనీ కొందరు చెబుతారు. ఈ అంశాలను ఆధారం చేసుకొనే రచయిత రజత్ అరోరా ‘ద డర్టీ పిక్చర్’ కథ రూపొందించారు. ఇక ఈ సినిమా కథ ఏమిటంటే – రేపు తన పెళ్ళి అనగా రేష్మ మద్రాసు పారిపోతుంది. సినిమా యాక్టర్ కావాలని కలలు కంటుంది. సినిమా రంగంలో పలు అవమానాలు ఎదుర్కొంటుంది. అబ్రహామ్ అనే దర్శకుడు ప్రోత్సహిస్తాడు. ఆమెకు నర్తకిగా ఓ అవకాశం కల్పిస్తాడు. తొలి చిత్రం ఫ్లాప్ కావడంతో సెల్వ అనే వ్యక్తి ఆమెకు ‘సిల్క్’ అనే పేరు తగిలిస్తాడు. దాంతో సిల్క్ రేష్మకు అదృష్టం కలిసొస్తుంది.
సూర్యకాంత్ అనే ముసలి హీరోతో సిల్క్ చిందులేయడం, తరువాత అతనితో రాత్రుళ్ళు గడపడం జరుగుతాయి. సూర్యకాంత్ తమ్ముడు రమాకాంత్ సిల్క్ ను ఆరాధిస్తూంటాడు. అతనితో ఎక్కువ సేపు గడుపుతూ ఉంటుంది. అదే సమయంలో సిల్క్ స్టార్ డమ్ కూడా మసకబారుతుంది. దాంతో సినీజనం షకీల అనే కొత్తమ్మాయిని ఎంచుకోవడం మొదలు పెడతారు. సిల్క్ ప్రవర్తన నచ్చక రమాకాంత్ దూరం జరుగుతాడు. దాంతో మద్యానికి బానిసవుతుంది సిల్క్. ఆమె పరిస్థితి చూసి జాలిపడే ఒకే ఒక వ్యక్తి డైరెక్టర్ అబ్రహామ్. అతను తాను సిల్క్ ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటాడు. తనతో పనిచేసిన వారందరికీ ఫేర్ వెల్ ఇవ్వాలనుకుంటున్నట్టు సిల్క్ , అబ్రహామ్ కు ఫోన్ చేస్తుంది. అతను వెళ్ళే సరికి, బెడ్ పై సిల్క్ శవంలా కనిపిస్తుంది. నిద్రమాత్రలు అధికంగా తీసుకొని, ఓ నోట్ రాసి ఆమె చనిపోయి ఉంటుంది. ఈ కథనంతా మనకు డైరెక్టర్ అబ్రహామ్ వివరించినట్టుగా తెరకెక్కించారు. తన జీవితం, ప్రవర్తనలో ఏది ఒప్పు, ఏది తప్పు అంటూ ప్రశ్నిస్తూ సిల్క్ జీవితం ముగియడం ప్రధానాంశం!
ఇందులో రేష్మగా విద్యాబాలన్ జీవించారనే చెప్పాలి. అందువల్లే ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. మిగిలిన పాత్రల్లో ఎమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, అంజు మహేంద్రు, రాజేశ్ శర్మ, ఇమ్రాన్, వికాస్, శివానీ టంకశాలే, నేహా బామ్ నటించారు. ఈ చిత్రంలోని పాటలకు విశాల్-శేఖర్ సంగీతం సమకూర్చగా, సందీప్ శిరోద్కర్ నేపథ్య సంగీతం అందించారు. ఇందులోని పాటలను రజత్ అరోరా పలికించారు. అన్ని పాటల్లోకి “ఊలాలా ఊలాలా…” పాట ఓ ఊపు ఊపేసింది. “ఇష్క్ సుఫియానా…”, “హనీ మూన్ కీ రాత్…”, “ట్వింకిల్ ట్వింకిల్…” పాటలు కూడా అలరించాయి. ఈ చిత్రానికి మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించారు.
ఈ సినిమా విడుదలకు ముందు సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు, నిర్మాత ఏక్తా కపూర్ పై కేసు వేయడం, వారు మీడియా ముందుకు వచ్చి హల్ చల్ చేయడం అన్నీ తరువాత పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. ఏమయితేనేమి, ఈ సినిమాకు ఆ స్టంట్ భలేగా పనిచేసింది. 18 కోట్ల రూపాయలతో నిర్మితమైన ‘ద డర్టీ పిక్చర్’ వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తరువాత పలువురు ఇదే పంథాలో పబ్లిసిటీ స్టంట్స్ చేసినా, ఎవరికీ ఈ స్థాయిలో కలసి రాలేదనే చెప్పాలి. ఈ చిత్రానికి మొత్తం మూడు నేషనల్ అవార్డులు లభించాయి. ఉత్తమనటిగా విద్యాబాలన్, ఉత్తమ క్యాస్టూమ్ డిజైనర్ గా నిహారికా ఖాన్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా విక్రమ్ గైక్వాడ్ జాతీయ అవార్డులు దక్కించుకున్నారు.