హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. తెలుగు ప్రజలకు ఉగాదితోనే సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండగ పర్వదినం రోజు ప్రతి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడిని చేసుకుని తింటుంటారు. ఉగాది పచ్చడి చేసుకోవడంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. ఈ ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తుంది. అందుకే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా ఉంటుంది. ఇందులో తీపి, చేదు, పులుపు, కారం, వగరు అన్ని ఉంటాయి.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే తీపి పదార్థాలు బెల్లం, అరటిపండు ఆనందాన్ని.. చేదుగా ఉండే వేప పువ్వు దు:ఖాన్ని.. కారంగా ఉండే పచ్చిమిర్చి కోపాన్ని.. ఉప్పగా ఉండే ఉప్పు ఉత్సాహాన్ని.. పుల్లగా ఉండే చింతపండు నేర్పును.. వగరుగా ఉండే మామిడి కొత్త సవాళ్లను సూచిస్తాయి. ఈ ఉగాది పచ్చడితో రుచులనే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాల్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి?
ఉగాది పచ్చడికి ముఖ్యమైనది వేప పువ్వు. ముందుగా వేపపూతను శుభ్రం చేసుకుని నీటితో కడగాలి. అనంతరం బెల్లం తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అటు మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడకట్టుకోవాలి. చింతపండు రసంలో బెల్లం వేసి.. కరిగే వరకూ కలపాలి. అనంతరం ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత వేపపువ్వు, అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు.. ఉగాది పచ్చడి రెడీ.