నోటి దుర్వాసన.. దీనిని హాలిటోసిస్ అంటారు. ఇది చాలామందిలో కామన్‌గా వచ్చే సమస్య. దీని వల్ల నలుగురిలో సరదాగా మాట్లాడలేం. ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం.. నోటి శుభ్రత పాటించకపోవటమే! కాబట్టి.. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగమని గుర్తించాలి. ఈ సమస్య రావడానికి చాలా కారణాలుంటాయి. దంతాల శుభ్రత లోపించినప్పుడు, పేగులు ఆరోగ్యంగా లేనప్పుడు, అసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నీటిని తక్కువగా తీసుకోవడం, పొగ తాగడం, చిగుళ్ల వ్యాధి, తీవ్ర మలబద్ధకం, నిద్ర పోయే సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం.. వంటి కారణా వల్ల ఈ సమస్య వస్తుంది. మరి.. దీనికి పరిష్కారం ఏంటి? ఈ కింది చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది.
* ఉదయం, రాత్రి చొప్పున రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం తప్పనిసరి.
* ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుకను టంగ్ క్లీనర్‌తో శుభ్రపరచుకోవాలి.
* పళ్లల్లో ఇరుక్కున పదార్థాలన్నీ బ్రషింగ్‌తో పోవు. అప్పుడు దారంతో పళ్లమధ్య ఉన్నవాటిని తొలగించాలి. రోజుకు ఒక్కసారైనా ఇలా చేయాలి.
* నోటిని డ్రైగా ఉంచుకోకూడదు. నీరు తగినంత తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే నీటిని పుక్కిలించి వేయాలి. ఇలా చేస్తే, నోటిని కడుక్కున్నట్టు అవుతుంది.
* కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
* ఉల్లిపాయలు, వెల్లుల్లి, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి వీటిని తగ్గించుకోవలి.
* టూత్ బ్రష్ ను ప్రతీ మూడు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. కనీసం ఏడాదికి ఒకసారి అయినా డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది.
* ఆపిల్ లేదా క్యారట్లను రోజు తినాలి. వీటి వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి, వాటిపై పేరుకున్న మలినాలు క్లీన్ అవుతాయి. ఫలితంగా నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది.
* కాఫీ కూడా దుర్వాసనకు మూల కారణం కాబట్టి, దాని బదులు గ్రీన్ టీ తీసుకుంటే ఉత్తమం. ఓ రీసెర్చ్ ప్రకారం గ్రీన్ టీ ఆరోగ్యంతో పాటు శ్వాసనూ మెరుగు పరుస్తుందని తేలింది.
* కొద్దిపాటి కొబ్బరి నూనెని నోటిలోకి తీసుకోని నాలుగైదు సార్లు పుక్కిలించడం వల్ల నోటిలోని హానికారక బాక్టీరియా పోతుంది, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.