వేసవి కాలం వచ్చేసింది. మే నెల ఇంకా రానేలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఎంత జాగ్రతలు తీసుకున్న మనల్ని మనం కాపాడుకోవడం కొంచెం కష్టమని చెప్పాలి. అందుకే ఈ వేసవిలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రతగా ఉండాలి అని డాక్టర్‌లు చెబుతున్నారు. ఇక మొక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చెట్ల ను ఇష్టపడనివారంటూ ఉండరు. చాలా మంది ఇండ్లల్లో మొక్కలు బాగా పెంచుతారు. చెప్పాలంటే ఇంకొంత మంది ప్రాణంగా కాపాడుకుంటారు. ఇంట్లో ఉన్నంత సేపు వాటితో ముచ్చటించేవారు కూడా ఉన్నారు. అంత ప్రేమగా చెట్లను పెంచుతారు. కానీ వేసవి కాలం ముగిసే సమయానికి చాలా మొక్కలు ఎండిపోతాయి. చిన్న చిన్న మొక్కలు అంతరించిపోతాయి. కనుక వేసవిలో మీ తోటలోని చెట్ల పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రక్షణ చర్యలు పాటిస్తేనే ఈ మండే ఎండలో కూడా మీ చెట్లు పచ్చగా ఉంటాయి. మరి ఏంటా సాధారణ చిట్కాలు అంటే..
1. వేసవిలో మొక్కలను కాపాడడం కష్టమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి. తీవ్రమైన వేడి, అగడి గాలులుతో మనమే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది మొక్కల సంగతి ఏంటి? నిజానికి ఎండాకాలం మొక్కలకు సవాలుగా ఉండే కాలం. తీవ్రమైన సూర్యకాంతి వల్ల ఎండిపోవడం, వాడిపోవడం, ఆకులు రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇలా జరగకుండా ఉండడం కోసం వేసవిలో మీరు చేయగలిగే చక్కటి సులభమైన పద్ధతి ఏమిటంటే తీవ్రమైన వేడిని తట్టుకునిపెరిగే మొక్కలను పెంచడం. మీ బాల్కనీ లేదా తోటలో ఇలాంటి మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. పామ్ చెట్టు, మల్లెపూలు, కలబంద వంటి మొక్కలను తీవ్రమైన సూర్యకాంతిలో పెంచవచ్చు. ఇవి సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి. వీటి సంరక్షనలో చిన్న మొక్కలు,కూరగాయల తోట వేసుకొండి. చుట్టూర ఎండను తట్టుకునే పామ్ చెట్టు పెంచితే వాటి కింద ఉన్న ఇలాంటి చిన్న చిన్న మొక్కలకు కొంత నీడ దొరుకుతుంది.
2. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మట్టి మార్చడం. మొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే వేసవి మొదలు కాకముందే మొక్కను వేరే మట్టిలో నాటాలి. మంచి తాజా మట్టితో పాటు కొత్త ఎరువులతో పెద్ద మట్టి పాత్రలోకి మొక్కలను మార్చండి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. ఇక మొక్కలకు నీరు పోసే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. నీరు రోజూ పోయాలా? ఎన్ని సార్లు పోయాలి? ఎప్పుడు ఎప్పుడు పోయాలి అని. అన్నింటికీ ఒకే సమాధానం మట్టి ఎండిపోకుండా ఉంచడమే. అంటే వేసవిలో మొక్కలు ఎండిపోవడానికి ప్రధాన కారణం మట్టి త్వరగా ఎండిపోవడం. కనుక మీ మొక్కలలో మట్టి ఎండిపోకుండా చూసుకోండి. వెంటనే నీరు పోయడం అలవాటు చేసుకోండి. కానీ అధికంగా నీరు పోస్తే వేర్లు కుళ్లిపోతాయి. కనుక గమనించి రెండు మూడు గంటలకు ఒకసారి నీరు చల్లుతూ ఉండండి చాలు.
3. తీవ్రమైన సూర్యకాంతి మొక్కల మీద నేరుగా పడకుండా చూసుకోండి. వాటికి రక్షణగా నెట్ లాంటివి కట్టండి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల వరకు నేరుగా పడే ఎండకు మొక్కలు కచ్చితంగా ఎండిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మొక్కలను లోపలికి తీసుకురావాలి లేదా నీడ పడేలా ఒక గుడ్డను వేసి కప్పి ఉంచాలి.
4. ఎరువులు ఏవైనా సరే వేసవి కాలంలో మొక్కలకు అధికంగా వేయకూడదు. ఎందుకంటే ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్ పై అధిక ఒత్తిడి పడుతుంది. తీవ్రమైన వేడిలో మొక్క పెరగడానికి బాగా కష్టపడుతుంది. ఎరువుల ఒత్తిడి మొక్కకు అదనపు సమస్య అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత మొక్కపై కప్పి ఉంచిన గుడ్డను తీసేయండి. మొక్కల ఆరోగ్యానికి తాజా గాలి చాలా అసవరం. అలాగే గూలాభి మొక్కలు అయితే దాదాపు ఎండ తగలకుండా జాగ్రత్త తీసుకోండి. ఎండకి మొగ్గలు త్వరగా వాడిపోతాయి. కనుక తోటిలో ఉన్న చేట్లాయితే జాగ్రత్త తీసుకోండి. భూమిలో ఉన్న చేట్లాయితే అంత జాగ్రత అవసరం లేదు.
5. చాలా మంది చెట్లకు నీరు పోయడం అంటే కింద మట్టిని మాత్రమే తడుపుతుంటారు. కానీ వేసవి కాలంలో ఆకులు కూడా నీరు పోయాలి. మీరు రోజూ నీరు పోసేటప్పుడు ఆకులపై కొన్ని చుక్కలు చల్లుతూ ఉండాలి. కాండాలకు రోజుకు రెండు సార్లు నీరు పోయాలి. ఇక మొక్క చక్కగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలన్నా పసుపు రంగులోకి మారిన ఆకులు, ఎండిపోయిన ఆకులు తొలగించడం మంచిది. ఎందుకంటే అవి మొక్క శక్తిని పీల్చుకుంటాయి. కనుక వాడిపోయిన రంగు మారిన ఆకులు మొక్క నుండి తొలగించండి.