Iron Deficiency Symptoms: మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ఒకటి. కానీ దీనిని మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. కేవలం దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ కూడా ఈ విషయాన్ని గ్రహించరు. కొందరు స్వయంగా ఐరన్ లోపం ఉందని భావించి అనవసరంగా ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Afghan-Pakistan War: కాల్పుల విరమణ ఉన్నా, ఆఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడులు..
ఐరన్ లోపం వల్ల కలిగే సాధారణ లక్షణాలు..
బ్రిటిష్ ఎన్‌హెచ్‌ఎస్, మయో క్లినిక్ నివేదికల ప్రకారం.. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.. నిరంతర అలసట, శక్తి తగ్గడం, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
అసాధారణమైన లక్షణాలు..
అధికంగా జుట్టు రాలడం, ముఖ్యంగా తల దువ్వినప్పుడు వెంట్రుకలు ఎక్కువగా ఊడటం, తరచుగా తలనొప్పి, మైకం, తల తిరగటం, నాలుక వాపు లేదా నొప్పి, చాక్, మట్టి, మంచు వంటి ఆహారేతర పదార్థాలు తినాలనే కోరిక కలగడం, నోటిలో పుండ్లు (అల్సర్లు), కాళ్లను నిరంతరం కదిలించే అలవాటు (రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్), గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారడం లేదా స్పూన్ ఆకారంలో వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.
లోపాన్ని ఎలా దూరం చేసుకోవచ్చు..
ఆహారంలో నుంచి మన శరీరానికి ఐరన్ రెండు రకాలుగా లభిస్తుంది. హీమ్ ఐరన్, నాన్-హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ అనేది జంతు ఆధారిత ఆహారాల నుంచి లభిస్తుంది. ఈ రకమైన ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మేక, గొర్రె, పశు, పంది మాంసం (రెడ్ మీట్), లివర్ (కాలేయం), గుడ్లు, చేపలు వంటి ఆహారంతో హీమ్ ఐరన్ లభిస్తుంది. నాన్-హీమ్ ఐరన్ అనేది మొక్కల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. పాలకూర, కాలే (లీఫ్ క్యాబేజీ) వంటి ఆకుకూరలు, బఠాణీలు, చిక్కుడు, పెసలు, శనగలు వంటి కాయధాన్యాల్లో లభిస్తుంది.
మీకు ఈ లక్షణాలు ఉంటే స్వయంగా మందులు తీసుకోవడం కంటే, వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం చిన్న సమస్యలా అనిపించినా, దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరానికి తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అవసరమైతే వైద్య సూచనతో ఐరన్ సప్లిమెంట్లు వాడడం ఉత్తమం అని సూచిస్తున్నారు.