Mehul Choksi Extradition: భారతదేశానికి చెందిన ఆర్థిక మోసగాడు మెహుల్ చోక్సీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురించి బెల్జియం కోర్టు నుంచి ముఖ్యమైన వార్తలు వచ్చాయి. చోక్సీని భారతదేశానికి అప్పగించడానికి ఆంట్వెర్ప్ కోర్టు ఆమోదం తెలిపింది. భారత ఏజెన్సీల డిమాండ్ చెల్లుబాటు అయ్యేదని, బెల్జియం పోలీసుల అరెస్టు చట్టబద్ధంగా సరైనదేనని కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత ఏజెన్సీలు CBI, ED లు ఒక పెద్ద చట్టపరమైన విజయాన్ని సాధించాయి.
READ ALSO: Bandi Sanjay: ఆ అబద్ధపు కథ కాంగ్రెస్ – ఎంఐఎం ప్రచారంలో మాత్రమే ఉంది..
భారత్‌కు గొప్ప మైలురాయి..
ఈ నిర్ణయం భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని చోక్సీ న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు. వాస్తవానికి చోక్సీని ఆంట్వెర్ప్ పోలీసులు ఏప్రిల్ 11, 2025న అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా ఆయన జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ దరఖాస్తులన్నింటినీ బెల్జియన్ కోర్టులు తిరస్కరించాయి. చోక్సీ తప్పించుకునే ప్రమాదం ఉందని, ఆయన అరెస్టును సమర్థిస్తున్నామని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
రూ.13,850 కోట్ల మోసం..
చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. PNB అధికారులతో కలిసి, నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoU)లు జారీ చేయడం ద్వారా చోక్సీ విదేశీ బ్యాంకుల నుంచి సెక్యూరిటీ లేకుండా రుణాలు పొందారని, ఆ డబ్బును షెల్ కంపెనీలకు బదిలీ చేయడం ద్వారా లాండరింగ్ చేశారని CBI కోర్టుకు తెలిపింది. భారతదేశం ఆయనపై మోసం, కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం, అవినీతి అభియోగాల కేసులు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని 120B, 201, 409, 420, 477A సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని 7, 13 సెక్షన్లను ఆయనపై ప్రయోగించారు. ఈ నేరాలు బెల్జియన్ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైనవని, అందుకే ద్వంద్వ నేరం అనే షరతు నెరవేరుతుందని కోర్టు పేర్కొంది.
నకిలీ వజ్రాలు, స్టాక్ మార్కెట్ స్కామ్‌లు..
మెహుల్ చోక్సీ తన కంపెనీల ద్వారా నకిలీ వజ్రాలను నిజమైనవిగా విక్రయించే రాకెట్టును నడిపాడని భారతదేశం కోర్టుకు తెలిపింది. ఆయన నకిలీ హామీలను ఉపయోగించి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు పొందాడని, మనీలాండరింగ్ ద్వారా వాటిని విదేశాలకు బదిలీ చేశాడని చెప్పింది. ఇంకా స్టాక్ మార్కెట్ అవకతవకల కారణంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చోక్సీని 10 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి నిషేధించింది. CBI ప్రయత్నాలు, అంతర్జాతీయ ఒప్పందాలను ఉటంకిస్తూ, UNTOC (ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కన్వెన్షన్), UNCAC (అవినీతి నిరోధక కన్వెన్షన్) లను పేర్కొంటూ భారతదేశం చోక్సిని అప్పగించాలని కోరింది. ఇప్పటి వరకు CBI బృందం మూడుసార్లు బెల్జియంకు వెళ్లి, అక్కడి అధికారులకు అన్ని ఆధారాలను సమర్పించి, యూరోపియన్ లా ఫర్మ్ సహాయంతో చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసింది.
చోక్సీని ఇండియాకు అప్పగించిన తర్వాత ఆయనకు సరైన చికిత్స అందిస్తామని భారతదేశం కోర్టుకు హామీ ఇచ్చింది. చోక్సీని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత ముంబై న్యూఢిల్లీలోని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నంబర్ 12లో ఆయనను ఉంచనున్నారు. యూరోపియన్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) ప్రమాణాల ప్రకారం.. ఆయనకు పరిశుభ్రమైన నీరు, ఆహారం, టీవీ, వార్తాపత్రికలు, వ్యక్తిగత వైద్యుడు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. చోక్సీని ఏకాంత నిర్బంధంలో ఉంచబోమని భారతదేశం పేర్కొంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. చోక్సీ 2018లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నానని, 2017లో యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని పేర్కొన్నారు. అయితే ఆయన ఇండియా పాస్‌పోర్ట్ రద్దు కాలేదని, అతను భారత పౌరుడిగానే కొనసాగుతున్నాడని భారతదేశం తెలిపింది. “భారతదేశం చేపట్టిన అప్పగింత కార్యకలాపాలలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటి” అని పేర్కొంటూ సీబీఐ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. జూలై 2024లో చోక్సీ బెల్జియంలో ఉన్న స్థానాన్ని ఏజెన్సీ గుర్తించింది, అదే సమయంలో అధికారిక అప్పగింత అభ్యర్థన ఆ దేశానికి పంపించింది.
READ ALSO: Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?