Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని శరీర కణాలు అసాధారణంగా పెరుగుతాయి, అవి వాటి చుట్టుపక్కల ఉన్న కణజాలాలు లేదా అవయవాలను కూడా దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించకపోతే, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనేక రకాల క్యాన్సర్లు జీవనశైలితో నేరుగా ముడిపడి ఉన్నాయి. ధూమపానం, మద్యం, జంక్ ఫుడ్, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, నోరు, రొమ్ము, గర్భాశయ, పెద్దప్రేగు క్యాన్సర్లు జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రక్త క్యాన్సర్, మెదడు కణితులు లేదా అండాశయ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లు పూర్తిగా జీవనశైలిపై ఆధారపడి ఉండవని చెబుతున్నారు. అవి జన్యు, అంటు లేదా హార్మోన్ల కారకాల వల్ల సంభవిస్తాయని పేర్కొన్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
క్యాన్సర్‌ను ఎలా నివారించాలంటే..
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణకు కొన్ని సరళమైన చర్యలు అవసరమని చెబుతున్నారు. మొదట ధూమపానం, పొగాకును పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు. ఇవి ఊపిరితిత్తులు, గొంతు, నోరు, కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా మారుతాయని హెచ్చరించారు. రెండవది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, బరువు నియంత్రణను కొనసాగించాలని చెబుతున్నారు. ఈ అలవాట్లను పాటిస్తే రొమ్ము, పెద్దప్రేగు, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. మూడవది క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు. HPV, హెపటైటిస్ B టీకాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి సహాయపడతాయని, దీంతో చికిత్స సులభతరం అవుతుందని చెబుతున్నారు.
వీటిని ట్రై చేయండి..
* ఒత్తిడిని తగ్గించుకుని తగినంత నిద్రపోవాలి.
* రోజువారీగా ఆహారంలో పండ్లు, కూరగాయలను తీసుకోవడం పెంచాలి.
* ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
* కాలుష్యం, రసాయనాలకు అధికంగా గురికాకుండా జాగ్రత్త పడాలి.
* శరీరంలో వచ్చే అసాధారణ మార్పులను విస్మరించవద్దు.