Vaccination: వైద్యారోగ్య చరిత్రలో ‘‘వ్యాక్సిన్’’ అనేది అద్భుత సృష్టిగా చెప్పవచ్చు. ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు ప్రజల్ని కాపాడుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కుడి చేతికి వేస్తే మంచిదా.? ఎడమ చేతికి వేస్తే మంచిదా..? అనే దానిపై ఆస్ట్రేలియన్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ‘‘వ్యాక్సిన్ మొదటి డోస్ ఏ చేతికి ఇస్తారో, బూస్టర్ డోస్ కూడా అదే చేతికి ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ఈ రీసెర్చ్‌లో వెల్లడించారు.
చేయి ఏదైనా కూడా, మొదటి డోస్ ఇచ్చిన చేతికే తర్వాతి డోస్ వ్యాక్సినేషన్ చేయడం మంచిదని చెప్పారు. గార్వాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్,UNSW సిడ్నీలోని కిర్బీ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ సెల్‌లో ప్రచురించబడ్డాయి.
వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన తర్వాత మాక్రోఫేజెస్ అని పిలువబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు ఇంజెక్షన్ ఇచ్చిన స్థలానికి సమీపంలోని లింప్ నోడ్స్‌లో ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొదటి డోస్ ఇచ్చిన ప్రాంతంలోనే రెండో డోస్ ఇచ్చినప్పుడు ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన మెమోరీ B కణాలు వేగంగా స్పందించడానికి సహాయపడుతాయి.
Read Also: LAVA: గేమ్ ఛేంజర్.. ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, ఎమర్జెన్సీ అలర్ట్స్..!
టీకా స్థానం ఎందుకు ముఖ్యం:
హానిచేయని వైరస్, బ్యాక్టీరియాలను శరీరంలో ప్రవేశపెట్టడం ద్వారా ‘‘వ్యాక్సిన్’’ పనిచేస్తుంది. ఈ హాని చేయని వాటిని మన శరీరం నిజమైన శత్రువులుగా భావించి, వీటికి ప్రతిరోధకాలు(యాంటీబాడీస్)ని ఉత్పత్తి చేస్తాయి. భవిష్యత్తులో ఇది నిజమైన వైరస్, బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలనే టెక్నీక్ మన రోగనిరోధక వ్యవస్థకు ఉంటుంది. వాటికి త్వరగా యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటుంది.
టీకాలు ఇచ్చిన తర్వాత, అది మన శరీరంలోని శోషరస కణుపులు(లింప్ నోడ్స్)- శరీరం రోగ నిరోధక శిక్షణా కేంద్రాలల గుండా ప్రయాణిస్తుంది. శరీరం మళ్లీ ఇలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను చూసినప్పుడు యాంటీబాడీస్(ప్రతినిరోధకాలు)ను ఉత్పత్తి చేయడంలో సహాయపడే మెమోరి B కణాలు, తరుచుగా ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాతానికి సమీపంలోని లింపు నోడ్స్‌లో కనిపిస్తాయి. బూస్టర్‌ను ఒకే చేతికి ఇచ్చినప్పుడు, ‘ప్రైమ్డ్’ మాక్రోఫేజ్‌లు త్వరగా స్పందించి బలమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి మెమరీ B కణాలను యాక్టివేట్ చేస్తాయి.
మాక్రోఫేజెస్ ఇన్ఫెక్షన్లను క్లియర్ చేయడానికి ఉపయోగపడటంతో పాటు, తదుపరి ఇమ్యునిటీ రెస్పాన్స్‌ని కూడా నిర్వహిస్తాయని అధ్యయంలో తేలింది. ఈ పరిశోధనలో భాగంగా ఫైజర్-బయోఎన్‌టెక్ COVID-19 వ్యాక్సిన్‌ను అందుకున్న 30 మందితో ఒక రీసెర్చ్ నిర్వహించారు. రెండు వేర్వేరు చేతులకు వ్యాక్సినేషన్ తీసుకున్న వారితో పోలిస్తే, రెండు డోసులు ఒకే చేతికి తీసుకున్న వారిలో యాంటీబాడీ ప్రతిస్పందన వేగంగా, ప్రభావవంతంగా ఉన్నట్లు గమనించారు.