Sweet Shock: స్వీట్ షాక్ తగితే చూడలేరని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటని ఆలోచిస్తున్నారా.. మీరు చదివింది కరెక్ట్. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక చక్కెర స్థాయిలు మధుమేహానికి కారణం కావడంతో పాటు, రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన డయాబెటిక్ రెటినోపతి అనే తీవ్రమైన కంటి వ్యాధికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Acidity: ఒక్క “టీ”తో ఎసిడిటీ మాయం?.. ఇంట్లోని వస్తువులతో ట్రై చేయండి..
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. అధిక చక్కెర వినియోగంతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. స్వీట్ ఎక్కువగా తింటే కలిగే ప్రమాదాలను మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుందని, కానీ లక్షణాలు మాత్రం క్రమంగా కనిపిస్తాయని చెబుతున్నారు. మీకు అత్యంత సాధారణంగా కనిపించే లక్షణం కంటి దృష్టి మసకబారడం. కొన్నిసార్లు రాత్రి సమయంలో చూపు అస్పష్టంగా మారుతుంది. తరచుగా కంటి ఇన్ఫెక్షన్లు లేదా వాపు కూడా ఒక సంకేతం కావచ్చు. ఈ లక్షణాలన్నీ దృష్టి లోపం, డయాబెటిక్ రెటినోపతిని సూచిస్తాయని చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో చికిత్స ప్రారంభించడానికి వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
క్రమం తప్పకుండా ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల రెటీనా తగినంత ఆక్సిజన్ పొందకుండా నిరోధిస్తుంది. ఇది అసాధారణమైన కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నాళాలు పెళుసుగా ఉంటాయని, ప్రమాదవశాత్తు ఒక వేళ నాళాలు పగిలిపోతే కళ్లలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని చెబుతున్నారు. దీంతో దృష్టి మసకబారడం, లేదా అంధత్వం రావడం జరుగుతుందని చెబుతున్నారు.
ఏం చేయాలంటే..
రోజువారీ జీవితంలో చక్కెర తీసుకోవడాన్ని పరిమితం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దని, స్వీట్లు తినడానికి బదులుగా పండ్లు , ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలని చెబుతున్నారు. కనీసం ఏడాదికి ఒకసారైన కళ్లను చెక్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉండటం మంచిదని అంటున్నారు. కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఆకుపచ్చ కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజూవారి ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.
READ ALSO: Russia–China: ముంచుకొస్తున్న మరో యుద్ధం.. తైవాన్‌పై దాడికి చైనాకు రష్యా సాయం..!