మీరు తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా జలుబుతో బాధపడుతున్నారు అంటే జాగ్రత్త అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యలా అనిపించే జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
జలుబు సాధారణంగా శరీరంలోకి వచ్చిన వైరస్‌లు శ్వాసనాళాల్లో వాపును కలిగించడం వల్ల వస్తుంది. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ మరింత క్రియాశీలంగా మారి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావంతో శ్వాసనాళాల్లో వాపు, గొంతు, ఊపిరితిత్తులపై ఒత్తిడి, ధమనులు కుంచించుకోవడం మొదలైన సమస్యలు కలుగుతాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చిన మొదటి వారంలో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిరంతరం ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చేతులు, మెడ, దవడ వరకు వ్యాపించే నొప్పి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి.
జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు క్రింది సమస్యలున్నవారిలో గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగించవచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం,ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మద్యపానం, ధూమపానం చేసే వ్యక్తులు, 40 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి వారు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా అలక్ష్యం చేయకూడదు.
నిపుణుల సూచనల ప్రకారం, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా రూపొందించబడింది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు, నిరంతరం జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వైద్యుణ్ని సంప్రదించి వ్యక్తిగత సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.