మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు దగ్గరికి వెళతాం. అక్కడ వారిచ్చే మందులు వాడేస్తాం. కానీ మనం మందుల షాపుకి వెళ్లకుండానే మన వంటింట్లో వుండే సహజ ఔషధాలను వాడాలని అనుకోం. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వందేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. వారి ఆరోగ్య రహస్యం వంటిల్లే అంటే నమ్ముతారా? వారు పదిమంది పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సలక్షణంగా జీవించారు.
నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా వాడితే మీరు వందేళ్ళు జీవించవచ్చు. ఈరోజుల్లో ఆస్పత్రులకు పెట్టే ఖర్చు అంతా ఇంతా కాదు.
పసుపు
మనం వంటల్లో వాడే పసుపు నిజంగా ఓ దివ్యౌషధం అంటే నమ్మండి. పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగివుంటుంది. అలాగే స్త్రీలు ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు. పాదాలకు రాసుకుంటారు. పేరంటానికి వెళితే ముందు కాళ్ళకు రాసేది పసుపే. ఇలా చేస్తే యాంటి బయాటిక్ గా ఉపయోగపడుతుంది. దీనిని ముఖానికి దట్టిస్తే ముఖారవిందం మరింతగా ఇనుమడింపజేస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పాలల్లో పసుపు వేసుకుని రాత్రిపూట తాగితే జలుబు, గొంతునొప్పి, ఇతర జీర్ణ సంబంధం వ్యాధులు మటుమాయం అవుతాయి.
అల్లం
అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం వాడుతూ వుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుంది. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది. అల్లం మన శరీర బరువుని కూడా తగ్గించే గుణం కలిగి వుంటుంది. చిన్నప్పుడు అల్లం, ఆముదం కలిపి ఇచ్చేవారు. సుఖ విరేచనం కలిగి, పొట్ట శుభ్రం అయ్యేది. ఇప్పుడు అలాంటివేవి తాగడం లేదు.
మెంతులు
మధుమేహ రోగులకు మెంతులు బాగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడుపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులో వుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. మెంతులు బాగా నానబెట్టి పేస్ట్ చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య పోవడమే కాదు. వెంట్రుకలు బాగా ఏపుగా పెరుగుతాయి. తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది.
జీలకర్ర
మన వంటింట్లో వుండే వాటిలో ముఖ్యమయినది జీలకర్ర. ఇది మన జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం. అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. జీలకర్రను వేడి చేసి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు. ఆకలిగా అనిపించకపోతే… జీలకర్ర.. అందులో కరివేపాకు, ఎండుమిర్చి కలిపి వేయించి మిక్సీ పట్టి ఆ పొడిని ఆహారం తినేముందు నెయ్యి గానీ, నువ్వుల నూనెతో గానీ సేవిస్తే అద్భుతమయిన ఫలితం వుంటుంది. కొంతమంది జీరా రైస్ కూడా తయారుచేసి తింటారు.
సోంపు
సోంపు శరీరానికి చలవ చేస్తుంది. ప్రతిరోజు భోజనానంతరం చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. సోంపు వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాలింతలు సోంపు నమిలితే పిల్లలకు తల్లిపాలు బాగా పడతాయి. ఆహారం తిన్న తర్వాత అందుకే మన పెద్దలు సోంపు తినమని చెబుతారు. హోటల్స్ లో కూడా సోంపు బాక్స్ మన టేబుల్ దగ్గర పెడతారు. సోంపు వల్ల నోటి దుర్వాసన పోతుంది.
Health tip:బ్రేక్‌ఫాస్ట్ అధికంగా తీసుకుంటేనే బరువు తగ్గుతారట..!