పిల్లల్తో హోమ్ వర్క్ చేయించడం, పరీక్షలకు ప్రిపేర్ చేయించడం పేరెంట్స్‌కు పెద్ద టాస్క్. ఎందుకంటే వారిని పట్టుమని పది నిమిషాలైన కదురుగా కూర్చోబెట్టలేం. అటు ఇటు పరుగెత్తడం, కదలడం వంటివి చేస్తుంటారు. దీనికి కారణం పెద్దల కంటే పిల్లల్లో తక్కువ శ్రద్ధ ఉండటమే. పిల్లల గరిష్ట శ్రద్ధ వారి వయస్సు కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. చదువుపై శ్రద్ధ పెట్టేందుకు, పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
పండ్లు, కూరగాయలతో మేలు ..
ఏకాగ్రతను దెబ్బతీసే అతిచురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య పిల్లలకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. కోపం వంటి భావోద్వేగాలనూ నియంత్రించుకోలేరు. ఇలాంటివారికి పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తున్నట్టు అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటితో ఏడీహెచ్‌డీ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు కనుగొన్నారు. మెదడులో కొన్ని నాడీ సమాచార వాహకాల మోతాదులు తగ్గటానికీ ఏడీహెచ్‌డీకీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నాడీ సమాచార వాహకాల తయారీలో, మొత్తంగా మెదడు పనితీరులో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా చికాకు..
ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా చికాకు కలుగుతుంది. ఏడీహెచ్‌డీ పిల్లలూ దీనికి మినహాయింపు కాదు. తగినంత ఆహారం తినకపోతే లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలకు తగినంత తిండి ఇవ్వలేని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో తలెత్తే ఒత్తిడి కుటుంబంలో గొడవలకు దారితీస్తోందని, ఇదీ పిల్లల్లో ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు తీవ్రమయ్యేలా చేస్తోందనీ వివరిస్తున్నారు. సాధారణంగా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఎక్కువైనప్పుడు డాక్టర్లు మందుల మోతాదు పెంచుతుంటారు. మందులు వేసుకోనివారికైతే చికిత్స ఆరంభిస్తారు. దీనికన్నా ముందు పిల్లలకు తగినంత ఆహారం అందుబాటులో ఉంటోందా? ఎంత మంచి ఆహారం తింటున్నారు? అనేవి పరిశీలించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ టిప్స్ కూడా పాటించండి
దీంతో పాటు పిల్లలకు చిన్న పనులను అప్పగించాలి. గది చిందరవందరగా కాకుండా అందంగా అలంకరించాలి. మెమరీ గేమ్‌లు ఆడించాలి. అంటే.. ఎరుపు కాంతి-ఆకుపచ్చ కాంతి, చదరంగం, సుడోకు, సైమన్ వంటి సాధారణ గేమ్‌లు ఏకాగ్రతను ప్రోత్సహిస్తాయి. వారి అభిప్రాయాలను తప్పకుండా వినాలి. ఇలా చేస్తే పిల్లల ఏకాగ్రత పెరుగుతోంది. చదువులో కూడా ముందుంటారు.
ఏకాగ్రత పెరిగేందుకు మరికొన్ని టిప్స్..
మీ పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. వారికి ఎక్కువగా ఫోన్ ఇవ్వకూడదు. ఓ ప్రణాళికతో చదువుకోవాలి. చదువుకు కూడా టైమ్ టేబుల్ రూపొందించాలి. చదివేటప్పుడు అర్థం కాని విషయాలు రాసుకోవాలి. ఇలా రాసుకుని ఆ అంశాన్ని టీచర్లకు అడిగి తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. దీంతో పాటు పిల్లలకు ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. వారికి సమతుల ఆహారం అందించాలి. పిల్లలకు ఇప్పటి నుంచే యోగా వ్యాయామం అలవాటు చేయడం చాలా మంచిది. యోగాతో ఏకాగ్రత పెరిగి చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.