డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ పోటాటో (చిలకడదుంప) తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే—చిలకడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా చిలకడదుంపలను ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణుల సూచన.
మధుమేహ రోగులు ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికీ, తగ్గించడానికీ ప్రధాన కారణం అవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది మనం తినే ఆహారం జీర్ణమైన తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో సూచించే ఒక ప్రమాణం. తెల్ల బియ్యం, బ్రెడ్, చక్కెర వంటి అధిక GI ఆహారాలు త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. అయితే చిలకడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
చిలకడదుంపలో సుమారు 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బంగాళాదుంపతో పోలిస్తే తక్కువ. అదనంగా ఇందులో సుమారు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చిలకడదుంపల్లో విటమిన్ A, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
చిలకడదుంపల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, వాపును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మరోవైపు సాధారణ బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 85 వరకు ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపల కంటే చిలకడదుంపలను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.