Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్‌లైన్‌గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Read Also: Google: 18 ఏళ్లు పనిచేసినా వదల్లేదు.. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట..
ఎందుకు బహిష్కరిస్తోంది..?
గతం కొంత కాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా దిగజారాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. వీరంతా కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, భారత్‌కి వ్యతిరేకంగా పనులు చేస్తున్నవారే. దీంతో పాటు పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు ఎక్కువయ్యాయి. వీటిన్నింటిలో ఆఫ్ఘన్ల ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది 24 ఆత్మాహుతి బాంబు దాడుల్లో ఆఫ్ఘన్ జాతీయలు ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని కాబూల్ తిరస్కరిస్తోంది. ఐక్యరాజ్యసమితితో పాటు హక్కుల సంఘాలు పాకిస్తాన్ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి.
ఎంత మంది విదేశీయులు ఉన్నారు..?
పాకిస్తాన్ లో డాక్యుమెంట్లు లేకుండా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉంటున్నారు. వీరితో పాటు ఇరాన్, మధ్య ఆసియాకు చెందిన కొంతమంది కూడా ఇందులో ఉన్నారు. పాకిస్తాన్ లో 40 లక్షల ఆఫ్ఘన్ వలసదారులు ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది డాక్యుమెంట్లు లేకుండా ఉన్నారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత 6 లక్షల మంది పాకిస్తాన్ లోకి వచ్చారు. ఇలా బలవంతంగా బహిష్కరించద్దని ఆఫ్ఘనిస్తాన్ కోరింది. తమకు తగినంత సమయం ఇవ్వాలని అంది. ఉగ్రవాద దాడుల్లో తమ వారు పాల్గొనడం లేదని పేర్కొంది.