White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..

  • నేనే ఏసుక్రీస్తు అవతారం..
  • వైట్ హౌజ్ కాల్పుల నిందితుడు..
  • గతంలో రెండుసార్లు అరెస్ట్..
  • తాజా ఘటనలో అధికారుల కాల్పుల్లో హతం..
White House Shooting (1)

White House Shooting (1)

White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది.

గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్ వద్ద హంగామా సృ‌ష్టించిన నేరాల కింద రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అధ్యక్ష భవనం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్ల తరుచుగా అధికారులు ఇతడిని గమనించేవారని నివేదికలు చెబుతున్నాయి. అరెస్ట్ సమయంలో తానే ఏసు క్రీస్తు అవతారమని, కావాలనే పోలీసులకు చిక్కానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌజ్ పరిసరాల్లోకి రావద్దని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వాటిని అతను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.

మే 24న వైట్ హౌజ్ వెలుపల ఉన్న 17 స్ట్రీట్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. దీని తర్వాత అతను తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అధికారులు జరిపిన కాల్పుల్లో నసీర్ బెస్ట్ మరణించాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ చెప్పారు.