Plotting to kill Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్న 17 ఏళ్ల నికితా కాసాప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రంప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పథకం ప్రకారం, తన తల్లిదండ్రుల్ని హత్య చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఇతడిని అరెస్ట్ చేశారు. విస్కాన్సిన్‌కి చెందిన నికితా కాసాప్ ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా కాసాప్(35), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్(51)వారి ఇంట్లోనే కాల్చి చంపాడని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరిద్దరి శరీరాల్లో బుల్లెట్లు కనిపించాయి. కుళ్లిపోయిన శరీరాలతో నే కొన్ని రోజులు పాటు ఇతను ఉన్నాడు. ఆ తర్వాత 14,000 డాలర్ల నగదు పాస్‌పోర్టు, తన పెంపుడు కుక్కతో పారిపోయాడని వాకేషా కౌంటీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. గత నెలలో కాన్సాస్‌లో ఇతడిని అరెస్ట్ చేశారు.
Read Also: Bengaluru: 3 రాష్ట్రాలు, 700 సీసీటీవీల నిఘా.. దొరికిన బెంగళూర్ లైంగిక వేధింపుల నిందితుడు..
అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు కావాల్సిన డబ్బు పొందేందుకు తన తల్లిదండ్రుల్ని హత్య చేసినట్లు విచారణలో తేలింది. కాసాప్ తన తల్లిదండ్రుల హత్యలకు ప్లాన్ చేశాడని, డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడని, రష్యన్ మాట్లాడే వ్యక్తితో సహా ఇతరులతో తన ప్రణాళికను పంచుకున్నాడని ఫెడరల్ అధికారులు భావిస్తున్నారు. అడాల్ఫ్ హిట్లర్‌ని ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటిసెమిటిక్ మ్యానిఫెస్టోని కూడా పోలీసులు కనుగొన్నారు.
ఇతడిపై రెండు ఫస్ట్ డిగ్రీ హత్య, శవాలను దాచిపెట్టడం, ఆస్తి దొంగతనం, అధ్యక్షుడిని హత్య చేయడానికి కుట్ర పన్నడం, సామూహిక విధ్వంసం, ఆయుధాలను వినియోగించడం వంటి 9 నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. తీవ్రవాద భావజాలం ఉన్న ఇతను తన హింసాత్మక ప్రణాళిక గురించి పలువురితో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అధికారులు టిటాయానా, మేయర్ మృతదేహాలను కనుగొన్నారు. మేయర్ గత రెండు వారాలుగా పనికి రాకపోవడం, నికితా కాసాప్ స్కూలుకు రాకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి.