Bengaluru: బెంగళూర్ నగరంలో ఇటీవల ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి.
అయితే, ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దాదాపుగా 700 సీసీటీవీల ఫుటేజీని స్కాన్ చేసి, చివరకు నిందితుడిని కేరళలోని ఓ మారుమూల గ్రామంలో పట్టుకున్నారు. బెంగళూర్ BTM లేఅవుట్ వద్ద ఒక సందులో ఇద్దరు మహిళలను ఒక వ్యక్తి వెంబడిస్తున్నట్లు సీసీటీవీలో రికార్డైంది. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల్లో, ఒకరిపై బలవంతంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
Read Also: MI vs DC: ఢిల్లీలో రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నిందితుడిని 26 ఏళ్ల సంతోష్‌గా గుర్తించారు. ఇతను నగరంలోని జాగ్వార్ షోరూంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన తర్వాత అతను బెంగళూర్ నుంచి తమిళనాడు హోసూర్ పారిపోయాడు. ఆ తర్వాత సేలం, కోజికోడ్‌కి వెళ్లాడు. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో అతడిని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. దాదాపుగా పోలీసులు మూడు రాష్ట్రాల్లో వారం పాటు వేట కొనసాగించారు.
అయితే, ఈ కేసులో హోంమంత్రి జి. పరమేశ్వర దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యల తర్వాత పొలిటికల్ వివాదం చెలరేగింది. ‘‘పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు సాధారణం’’ అని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. మహిళపై నేరాలను సాధారణీకరిస్తున్నారా.??, మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పరమేశ్వర క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు.