US-Venezuela: వెనిజులాపై అమెరికా దాడి చేయబోతుందనే సమచారం అమెరికా మీడియా సంస్థలకు ముందుగానే తెలుసని, కానీ అవన్నీ మౌనం వహించినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ మీడియాలకు ఈ దాడి గురించిన సున్నిత సమాచారం ఉంది. అయితే, అమెరికన్ దళాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో దాడి విషయాన్ని ప్రచురించలేదని తెలుస్తోంది.
అమెరికన్ న్యూస్ వెబ్‌సైట్ సెమాఫోర్ ప్రకారం, రెండు మీడియా సంస్థలకు ఈ దాడి గురించి ముందే తెలుసని, సీనియర్ ఎడిటర్లకు మిషన్ గురించి వివరించబడిందని, అంతర్గత చర్చల తర్వాత, ఆపరేషన్‌లో పాల్గొన్న యూఎస్ సిబ్బంది భద్రతపై ఆందోళనలను లేవనెత్తుతూ, వార్తా సంస్థలు ఈ దాడికి సంబంధించిన వివరాలను ముందస్తుగా ప్రచురించకూడదని నిర్ణయించుకున్నాయి.
నివేదిక ప్రకారం, జాతీయ భద్రతా విషయాలపై ముఖ్యంగా ప్రాణాలకు ప్రమాదం ఉన్న సమయంలో, సంయమనం పాటించే విధానం అమెరికన్ జర్నలిజంలో దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయమని తెలియజేసింది. అమెరికన్ మీడియా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఘర్షణ వాతావరణం ఉన్న సమయంలో వెనిజులా దాడి విషయం ముందుగానే తెలిసినా కూడా మీడియా సంస్థలు వార్తల్ని బయటకు రానీవ్వలేదు.
శనివారం తెల్లవారుజామున, యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేశాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని బంధించి అమెరికాకు తరలించారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం కేసులు మోపబడ్డాయి. అయితే, ఇలా ఒక దేశాధినేతను పట్టుకెళ్లడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. రష్యా, చైనా, ఇరాన్, కొలంబియా, మెక్సికో వంటి దేశాలు ఖండించాయి. అమెరికన్ జీవితాలు నాశనం చేయడానికి మదురో డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపాడని, అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు.