Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రసంస్థ మెరుపుదాడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. పటిష్ట నిఘా వ్యవస్థ, సైన్యం ఉన్న ఇజ్రాయిల్ కూడా ఈ దాడిని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. పారా గ్లైడర్లు, బుల్డోజర్ల ద్వారా ఇజ్రాయిల్ సరిహద్దు దాటి లోపలకి వచ్చిన హమాస్ ఉగ్రమూకలు దొరికిన వారిని దొరికినట్లు చంపేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోయారు.
అయితే, ఈ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడి గర్వంగా ఉందంటూ ఇరాన్ సుప్రీంలీడర్ సలహాదారు కీలక వ్యాఖ్యలు చేయడం కూడా ఈ ఊహాగానాలకు తావిచ్చాయి. అయితే తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్ల అలీ ఖమేనీ స్వయంగా వెల్లడించారు.
పాలస్తీనాకు గ్రూప్ హమాస్ కి మద్దతు ఇచ్చే ఇరాన్, హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తుందని తెలుసు, కానీ ఈ దాడికి ఇరాన్ ప్రయేయం ఉన్నట్లు ప్రస్తుతానికి సమాచారం లేదని అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపినట్లు సమచారం. అయితే హమాస్ ఇజ్రాయిల్ పై జరిపిన దాడిని చూసి ఇరాన్ ఆశ్యర్యపోయినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించిందని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.