USA: అమెరికా, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి యూఎస్‌కు తీసుకువచ్చారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరాకు కారణమవుతున్నాడని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని మదురోపై కేసులు మోపబడ్డాయి. అయితే, ట్రంప్ చర్యల్ని పలు దేశాలు ఖండిస్తున్నాయి. రష్యా, చైనా, ఇరాన్, క్యూబా, కొలంబియా వంటి దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సొంత దేశంలో కూడా ట్రంప్ తీరును ప్రతిపక్ష డెమోక్రాట్లు ఖండిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ ట్రంప్ చర్యల్ని తప్పుపట్టారు.
Read Also: Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..
ఇదిలా ఉంటే, భారత సంతతికి చెందిన అమెరికా శాసనసభ్యుడు రో ఖన్నా కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం, యుద్ధాలను సాధారణీకరించడం ద్వారా అమెరికా ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించిందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయాన్ని విమర్శి్స్తూ.. రష్యా, చైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెరికా ఎలా స్పందిస్తుందని ప్రశ్నించారు. ఈ దాడి ఎంపిక చేసుకున్న యుద్ధమని వర్ణించారు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేసి జెలెన్స్కీని బంధిస్తే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా ఏం చెబుతుంది?? అని ప్రశ్నించారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య దాని నైతిక అధికారాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు.