Pakistan: ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల నుంచి గ్యాస్, కరెంట్, ఇంధనం ఇలా ప్రతీ దాని రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు వేగంగా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. తినడానికి మూడు పూటలు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా పేదరికంలో కూరుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.
Read Also: Holi In Metro: మెట్రోలో హోలీ జరుపుకుని వైరల్ అయిన ఇద్దరు మహిళల అరెస్ట్..
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని పేదరికంతో ఉన్న ఓ వ్యక్తి తన భార్య, ఏడుగురు మైనర్ పిల్లల్ని శుక్రవారం గొడ్డలితో నరికి చంపాడు. సజ్జాద్ ఖోఖర్ అనే కూలీ తన భార్య కౌసర్(42), ఎనిమిది నెలల నుంచి 10 ఏళ్లు కలిగిన తన ఏడుగురు పిల్లలపై గొడ్డలితో దాడి చేసి వారందరిని కర్కషంగా చంపేశాడు. నిందితుడు ఆర్థిక సమస్యలతో మనస్థాపానికి గురై భార్యతో తరుచూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన పంజాబ్ ప్రావిన్సులో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌లోని దయనీయ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. హత్యలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన పిల్లలకు ఆహారం ఇవ్వలేనందున ఈ పని చేశానని నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రావిన్స్ ఐజీ నుంచి నివేదిక కోరారు.