Ukrainian President: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 22వ భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత తొలిసారిగా రష్యాలో పర్యటిస్తున్నారు. అయితే, ప్రధాని మోడీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ- వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తీవ్రంగా ఖండించారు. రష్యా నిరంతరం ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న సమయంలో.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు అక్కడికి వెళ్లి ప్రపంచంలోని అతి పెద్ద క్రిమినల్ ను కౌగిలించుకోవడం చాలా బాధాకరం అని జెలెన్ స్కీ విమర్శించారు.
Read Also: PM Modi: రాబోయే పదేళ్లు భారత్కి అత్యంత సంక్లిష్టమైన సమయం
అయితే, ఈ రోజు రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణితో దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 37 మంది మృతి చెందగా.. 13 మంది చిన్నారులు సహా 170 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులు చికిత్స పొందుతున్న అతి పెద్ద పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి చేసిందని జెలెన్ స్కీ ఆరోపించారు. ఇక, భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో, వాణిజ్యం, ఇంధనం, రక్షణతో సహా విభిన్న రంగాలలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే మార్గాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రధాని మోడీ- అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంభాషణలో ముఖ్యమైన అంశంగా చెప్పుకొచ్చింది.