ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? ఇరు దేశాల మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఈ రెండు అంశాల మీద అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడ్డ రష్యా చర్యను భారత్ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికా సహా పలు పశ్చిమ దేశాలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా భారత్ మనసు మర్చాలని చూస్తున్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల అమెరికా, దాని మిత్ర దేశాల విదేశాంగ మంత్రులు ఒకరి తరువాత ఒకరు భారత్‌లో పర్యటించారు. రష్యా చర్యను ఖండించాలని భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తటస్థ వైఖరితో ఉండటం వాటికి ఇబ్బందిగా మారింది. సార్వభౌమ దేశంపై ఆక్రమణకు పాల్పడిన రష్యాపై అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు జర్మనీ, బ్రిటన్ సహా పలు పశ్చిమ యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.
ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అమెరికా ఈ సంక్షోభాన్ని ప్రపంచానికి చూపించాలని ప్రయత్నిస్తోంది. కనుక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ తమ వెంట నడవకపోతే ఆమెరికా అంటున్న ప్రజాస్వామ్య పోరాటానికి అర్థం ఉండదు. అందుకే అన్ని దేశాలు భారత్ వెంటపడుతున్నాయి. అయితే.. ఈ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నాయి.
రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాలన్నింటిలో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. తటస్థ వైకరి అవలంభించింది. ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా అంటోంది. కానీ, యూరప్‌లోని మిత్రదేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఆపలేకపోయిన అమెరికా.. భారత్‌కు వద్దు అని ఎలా చెబుతుంది అనేది ప్రశ్న. తన చమురు అవసరాల కోసం రష్యా నుంచి చవకగా లభించే అవకాశాన్ని భారత్ ఎలా వదులుకుంటుంది? అందుకే అమెరికా ఏమనుకున్నా రష్యా నుంచి అయిల్ కొనుగోలు చేస్తోంది. అది మాత్రమే కాదు రష్యా నుంచి ఎస్ -400 క్షపణి వ్యవస్థ నుంచి కూడా వెనక్కి వెళ్లలేదు. అలాగే, రూపాయి- రూబుల్ మారకంలో వాణిజ్యం జరపటం వైపు భారత్ అడుగులు వేస్తోంది. వీటన్నింటి దృష్ట్యా భారత్ -అమెరికా మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది.
ఉక్రెయిన్ విషయంలో అమెరికా మాట వినకపోవటం నేరమా? ఆ మాటకొస్తే నాటో సభ్య దేశాలు కూడా అనేక సందర్బాలలో అమెరికా నిర్ణయాలపై వ్యతిరేక వైకరి తీసుకున్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై చాలా ఏళ్లుగా జర్మనీ, ఫ్రాన్స్ వీటో చేస్తూ వచ్చాయి. అలాగే అమెరికాకు ఇష్టం లేకపోయినా చమురు సరఫరా కోసం రష్యా నుంచి నార్త్‌స్టీమ్ 2 పైప్ లైన్‌ను జర్మనీ నిర్మిస్తోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే ఇజ్రాయెల్, టర్కీ, యూఏఈ రష్యాపై ఆంక్షలకు ఇష్టపడలేదు. అమెరికా మరో సన్నిహిత దేశం సౌదీఅరేబియాకు చైనాతో వ్యాపార బంధం బలపడుతోంది. చైనా అధినేత షీ జిన్‌పింగ్ మే నెలలో సౌదీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సౌదీ అరేబియా నుంచి ఆయిల్ దిగుమతి చెల్లింపులను డాలర్లకు బదులు చైనా కరెన్సీ యువాన్‌లలో ఉండేలా ఒప్పందం ఫైనల్ అవుతుందని బావిస్తున్నారు. సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులలో నాలుగింట ఒక వంతు చైనాకు విక్రయిస్తుంది. కనుక భారత్ మాత్రమే ఏదో తప్పు చేసినట్టు అమెరికా ఓవరాక్షన్ చేయటం ప్రపంచం గమనిస్తోంది.
ప్రచ్చన్న యుద్దం ముగిసిన ఈ మూడు దశాబ్దాలలో భారత్-అమెరికా మధ్య బంధం ఎంతో బలపడింది. భారత్ నాటో సభ్య దేశం కాకపోయినా ఆ స్థాయిలో భారత్‌ను అమెరికా తన మిలటరీ భాగస్వామిగా చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సైనిక లాజిస్టిక్స్ మార్పిడి, సురక్షిత సమాచార మార్పిడి కోసం అనేక ఒప్పందాలు కుదిరాయి. వాటిలో జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (2002), లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (2016), కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (2018), బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్-బెకా (2020) ఒప్పందం కుదిరాయి.
తాజాగా అమెరికా, భారత్ 2+2 భేటీ సందర్భంగా కీలక రక్షణ ఒప్పందాలు జరిగాయి. దీని ప్రకారం అమెరికా యుద్ధ నౌకల నిర్వహణతోపాటు మరమ్మతులు చేసేందుకు భారత షిప్‌యార్డ్‌లను వినియోగించుకోనున్నారు. ఒకప్పుడు ఇరాక్ యుద్ద సమయంలో అమెరికా విమానాలు ఇంధనం నింపుకునే విషయం మీదనే మన దేశంలో పెద్ద చర్చ జరిగింది. కానీ ఈ ఒప్పందంతో యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా నౌకలు మన ఓడ రేవులలో మరమ్మతులు చేసుకునే వీలు కలుగుతుంది. సాధారణంగా నాటో సభ్య దేశాలు మాత్రమే అమెరికా యుద్ధ నౌకలకు ఇలాంటి అవకాశం ఇస్తాయి. ఎందుకంటే అవి సాధారణ నౌకలు కాదు.. యుద్ధ నౌకలు వేరు. యుద్ధ నౌకల మరమ్మత్తులకు అవకాశం ఇస్తే యుద్ధంలో పాల్గొన్నట్టే అవుతుంది. ఈవిధంగా అమెరికా భారత్ మధ్య బలమైన మిలటరీ భాగస్వామిగా మారింది.
ఇప్పడు విషయం ఏమిటంటే ఉక్రెయిన్ విషయంలో భారత్ వైకరిని అమెరికా తప్పుపట్టడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగతాయి. మరింత ఒత్తిడి తెచ్చి బహుశా అంతిమంగా రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనకుండా అమెరికా నుంచి కొనేలా చేయవచ్చు. నిజానికి, రష్యా పట్ల భారత్ వైకరి మారుతుందని నమ్మకం అమెరికాకు లేదు. ఐనా ఎందుకు ఈ స్థాయిలో ఎందుకుఎ ఒత్తిడి తెస్తున్నది అంటే ఆంక్షల బూచీ చూపి భారత్‌కు రష్యా ఆయుధ విక్రయాలను దూరం చేయటమే. ఇటీవలి 2+2 భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ మాటలే దీనిని స్పష్టం చేస్తున్నాయి. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేస్తున్నందుకు ‘కాట్సా చట్టం’ ప్రకారం భారత్‌పై ఆంక్షలు విధించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఎందుకు అన్నాడో అర్థం చేసుకోలేమా?
భారత్-రష్యాల మధ్య మైత్రి గతం అనే భావనలో అమెరికా ఉంది. తానే ఇప్పుడు భారత్‌కు మెరుగైన భాగస్వామిగా బావిస్తోంది. గత పదేళ్లుగా భారత్‌తో రక్షణ సంబంధాల్ని మరింతగా పెంచుకుంటోంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఇరు దేశాల నేవీకి సంబంధించి సహకారం మెరుగవుతోంది. అమెరికా, భారత్ ఉమ్మడి శతృవు చైనాను ఈ ప్రాంతంలో కట్టడిచేసేందుకు ఏర్పడిన క్వాడ్ కూటమిలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు భారత్ కూడా భాగస్వామి. కనుక గత ఇరవై ఏళ్లలో రక్షణ పరంగా అమెరికాతో కలిసి భారత్ ఇప్పటికే చాలా దూరం ప్రయాణించింది.
వాస్తవానికి అమెరికాకు ప్రధాన శత్రువు రష్యా కాదు.. చైనా. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్దం వల్ల రష్యాను ప్రధాన శత్రువుగా అమెరికా ముందుకు వచ్చింది. కానీ దాని అసలు టార్గెట్ చైనా. అంతిమంగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పోటీ అమెరికా, చైనా మధ్యనే నెలకొని ఉంది. ఈ రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఆర్థిక, సాంకేతిక, సైనిక పరంగా కూడా అమెరికాకు సరి జోడు చైనా మాత్రము. కనుక చైనాకు వ్యతిరేక అమెరికా నిర్మించే ఒక విస్తృత భాగస్వామ్య కూటమిలో భారత్ కీలక దేశంగా మారటం అనివార్యం. కనుక ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి అమెరికాకు నచ్చకపోయినా బంధం తెంచుకునే పరిస్థితి లేదు. కనుక ఆమెరికా, భారత్ మైత్రి ముగిసినట్టే అనే అభిప్రాయానికి రావటం సరికాదు.
Vegeterian Country: భారత్ శాఖాహార దేశమా..మాంసం తినటం నేరమా?