కొంత కాలంగా మన దేశంలో ఆహార అలవాట్లను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన నవరాత్రి సందర్బంలోనూ దానిని చూశాం. పర్వదినాలలో దేశ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసివేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో ఉంచరాదని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే, ప్రగతిశీల వాదులు దానిని కౌంటర్ చేస్తున్నారు.
మాంసాహారం పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉత్తర, మధ్య భారత్‌లో కనిపిస్తుంది. అక్కడ ఈ అంశాన్ని ఒక సమస్యగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఐతే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో ప్రజల ఆహార అలవాట్లు పెద్ద విషయం కానే కాదు. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే పరిస్థితి భిన్నంగా ఉంది. అందుకు కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉదాహారణ.
పిల్లలకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం మెనూ నుంచి కోడిగుడ్డును గతంలో కర్నాటక ప్రభుత్వం తొలగించింది. కానీ ఆ రాష్ట్ర జనాభాలో 78.9 శాతం మంది మాంసాహారులనే విషయం మరవకూడదు. దాంతో పిల్లల తల్లిదండ్రుల నుంచి తీవ్రత వ్యతిరేకత వ్యక్తమైంది. లింగాయత్‌లు, జైనులు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం గుడ్డును తిరిగి మెనూలో చేర్చక తప్పలేదు. ఇక, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మిడ్-డే మీల్స్ మెనూలో ఎగ్‌ను చేర్చింది. కానీ 2020లో శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి అధికారంలోకి వచ్చాక పిల్లలకు గుడ్డు దూరమైంది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినపుడు నార్త్, సెంట్రల్ ఇండియాలో మాంసం తినేవారు చాలా తక్కువ. నేపషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలోని 51 శాతం మహిళలు, 33 శాతం పురుషులు ఎన్నడూ మాంసం ముట్టని శాఖాహారులు. అదే వెస్ట్రన్ ఇండియాలో 31 శాతం మహిళలు, 23 శాతం మంది పురుషులు శాఖాహారులు. దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఈ అంకెలు పూర్తి భిన్నం. ఉత్తరాది, దక్షిణాది ఆహార అలవాట్లలో చాలా తేడా ఉందని అర్థమవుతుంది.
దక్షిణ భారతంలో కేవలం 8 శాతం మహిళలు, 5 శాతం పురుషులు మాత్రమే శాఖా హారులు. ఈస్ట్ ఇండియాలో శాఖాహారులు ఇంకా తక్కువ. 7 శాతం మహిళలు, 4 శాతం పురుషులు అక్కడ మాంసం ముట్టరు, ఒడిషా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతం కిందకు వస్తాయి. నార్త్ ఈస్ట్ విషయానికొస్తే 2శాతం మంది మహిళలు, 1 శాతం పురుషులు మాత్రమే శాఖాహారులు. దీనిని బట్టి ఉత్తర, మధ్య భారత జనాభాలో దాదాపు సగం మంది, దక్షిణాది విషయంలో 98 శాతం మంది మాంసాహారులను తెలుస్తోంది. ఈస్ట్‌లో 96 శాతం, నార్త్-ఈస్ట్ లో 99 శాతం మాంసాహారులు. కనుక మన దేశం శాఖాహార దేశం కాదని చెప్పాల్సి వుంటుంది. మొత్తంగా చూసినపుడు దేశంలో 80 శాతం మంది ప్రజలు మాంసం తింటున్నారు. గుడ్డు తినేవారిని కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది.
స్త్రీ, పురుష జనాభా పరంగా చూసినపుడు ఉత్తర, మధ్య భారతదేశంలో 43 శాతం మంది స్త్రీలు , 27 శాతం మంది పురుషులు శాఖాహారులు, వెస్ట్రన్ ఇండియాలో 31 శాతం మంది మహిళలు, 24 శాతం మంది పురుషులు శాఖాహారులు. ఇక శాఖాహారంలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 80 శాతం మంది మహిళలు, 56 శాతం మంది పురుషులు మాంసం ముట్టరు. మొత్తం మీద హర్యానా జనాభాలో 65 మంది శాఖాహారులు. పంజాబ్ తరువాత స్థానంలో రాజస్థాన్ నిలుస్తుంది. ఆ రాష్ట్రంలో 75 శాతం స్త్రీలు, 63 శాతం పురుషులు శాఖాహారులు. పంజాబ్‌లో 75 శాతం మహిళలు, 45 శాతం పురుషులు శాఖాహారులు. గుజరాత్‌లో 61 శాతం మహిలలు, 50 శాతం పురుషులు శాఖాహారులు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పాల ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటుంది 72 శాతం మంది మహిళలు, 64 మంది పురుషులు నిత్యం పాలు తాగుతారు. అలుగు పప్పుదినుసుల వినియోగం కూడా ఈ రాష్ట్రాలో చాలా ఎక్కువ.
ప్రజాస్వామ్య దేశంలో ఇతరుల హక్కులకు భంగం కలగకుండా దేనినైనా ప్రొమోట్ చేసుకునే హక్కు పౌరులకు ఉంది. కనుక ఆహారాన్ని, ఆహార అలవాట్లను కూడా ప్రొమోట్ చేసుకోవచ్చు. కానీ ఫలానా ఆహారం మేము తినం కాబట్టి మీరు కూడా తినకూడదు అంటే ఎలా? మెజార్టీ వర్గమైన హిందువులలో 80 శాతం మంది మాంసాహారులే ఉన్నప్పుడు ..దానిని తినకూడదని బలవంతం చేయటం సమంజసమా? భారతదేశంలో దాదాపు నలబై కోట్లకు పైగా ప్రజలు శాఖాహారులు. ప్రపంచంలోఅత్యధిక శాఖాహారులు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. కానీ మెజార్టీ ప్రజలు మాంసహారులు. కోడి, గొర్రె మాంసాన్ని ఎక్కువగా తింటారు. అయినా భారత్‌ను ప్రపంచ శాఖాహార రాజధానిగా ఎందుకు పరిగణిస్తారు?
వాస్తవానికి, మాంసాహారం భారతీయ సంస్కృతిలో భాగం. సింధూ లోయ నాగరికతలో వివిధ రకాల జంతువులను వినియోగించినట్లు బలమైన పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఆహార అలవాట్లపై ప్రస్తుతం జరుగుతున్న దాడిని చరిత్ర వాస్తవాలను చెరిపే ప్రయత్నంగా చరిత్రకారులు చూస్తున్నారు. ఆహార చరిత్ర చుట్టూ రాజకీయ కథనాన్ని రూపొందించే కుట్రగా వారు దీనిని చూస్తున్నారు. 1857 నుంచి ఇప్పటి వరకు భారతతేశంలో ఆహారం ఈ స్థాయిలో రాజకీయం కాలేదని ప్రముఖ పాత్రికేయులు వీర్ సంఘ్వీ గతంలో తాను రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ముఖ్యంగా గొడ్డు మాంసంపై ఆగ్రహం వెల్లగక్కడం ముమ్మాటికీ రాజకీయమైనదే అని అంటారాయన.
హిందువులలోని అగ్ర కులాల వారు గొడ్డు మాంసం చాలా వరకు ముట్టరు. కానీ, దళితులు, ముస్లింలు, క్రైస్తవులలో అధిక భాగం దీని ఆహారంగా తీసుకుంటారు. పంది మాంసాన్ని ముస్లింలు తినరు..కానీ క్రైస్తవులలో ఎక్కువ మంది, కొంత మంది హిందువులు తింటారు. కనుక ఆహార అలవాట్లు అనేవి వ్యక్తిగతమైనవవని ..దానిపై ఆంక్షలు పెట్టటం సరికాదని గుర్తించాలి.
నిజం చెప్పాలంటే, భారతదేశం ఏనాడూ పూర్తి శాఖాహారి కాదు. వైశ్య, బ్రాహ్మణ, జైన సమూహాలు కొన్ని మాంసం తినేవారు. ఉదాహరణకు, చెట్టినాడ్ వైశ్యులు మాంసాహార ప్రియులు. సారస్వత బ్రాహ్మణులు కూడా మాంసాహారం తీసుకుంటారు. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల ముందు ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ ఇప్పడు అది ఒక వివాదాస్పద అంశంగా మారటం ఆశ్చర్యం. మనం ఎటు నుంచి వెళుతున్నామో దీనిని బట్టి చేసుకోవచ్చు.