Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో వైట్ హౌజ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు, సుంకాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ వీధిలో ఆలయం..
ఉక్రెయిన్‌పై గత రాత్రి రష్యా వరసగా దాడులు చేసిన తర్వాత, ట్రంప్ పుతిన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం కుదిరే వరకు రష్యాపై ఎత్తున బ్యాంకింగ్ ఆంక్షలు, ఆంక్షలు, సుంకాలను నేను గట్టిగా పరిశీలిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. రష్యా , ఉక్రెయిన్ చాలా ఆలస్యం కాకముందే చర్చలకు రావాలని కోరారు.
మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి వెస్ట్రన్ దేశాలు, అమెరికా ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ దేశాలు, జపాన్ రష్యాపై 21,000 కంటే ఎక్కువ ఆంక్షల్ని విధించాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ముగింపుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉక్రెయిన్, రష్యాలు శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నారు. జనవరి నెలలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పుతిన్ యుద్ధాన్ని ముగించకపోతే సుంకాలు, మరిన్ని ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.