Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అయితే, కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, విద్యుత్, శక్తి వనరులపై 10 శాతం పన్నులు విధించనున్నారు.
Read Also: Aamir Khan: పెళ్లికొడుకు కాబోతున్న బాలీవుడ్ హీరో..
సుంకాలను విధించడంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసల్ని నిరోధించి దేశ ప్రజలకు మరింత భద్రత ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలు అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన సరిహద్దు సంక్షోభానికి ఆజ్యం పోశాయి. బైడెన్ నాయకత్వంలో 10 మిలియన్లకు పైగా అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, వీరిలో చైనా జాతీయులు మరియు ఉగ్రవాద నిఘా జాబితాలో ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది” అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే, అమెరికా తీరుపై కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయానికి అంతే ధీటుగా కెనడా కూడా అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని, అయినా కెనడా సిద్ధంగా ఉందని అన్నారు. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్ ముదిరింది. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులకు ముందు.. అమెరికా కెనడాపై సుంకాలు విధిస్తే అంతే ధీటుగా ప్రతిస్పందన ఉంటుందని ట్రూడో హెచ్చరించారు.