Greenland issue: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను డెన్మార్క్ దేశానికి చెందిన ద్వీపమైన ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై పడింది. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ కావాల్సిందే అని ట్రంప్ చెబుతున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికా దుందుడుకు చర్యలపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో డెన్మార్క్ సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్‌పై దాడి చేస్తే ఇది నాటో భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని యూరప్ దేశాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఎలాగైన గ్రీన్‌ల్యాండ్‌ను సొంత చేసుకోవాలని ట్రంప్ పరిపాలన కీలక సమాలోచనలు చేస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌లోని ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వాలనే ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా డెన్మార్క్‌ను నుంచి సెమీ అటానమస్ ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను వేరుచేయడమే. వైట్ హౌజ్ సోర్సెస్ ప్రకారం, గ్రీన్‌ల్యాండ్‌లోని ప్రతీ నివాసితుడికి 10,000 డాలర్ల నుంచి 100,000 డాలర్ల వరకు నగదు ఇవ్వాలనే ఆలోచనలపై అమెరికా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also: Makhunik Village: ఇక్కడి వారందరూ మరుజ్జులే.. ప్రపంచంలోనే అత్యంత వింతైన గ్రామం ఇదే!
మరోవైపు, డెన్మార్క్ కూడా ట్రంప్‌కు ధమ్కీ ఇచ్చింది. అమెరికా తమపై దాడి చేస్తే, తమ సైనికులు ఆదేశాల కోసం ఎదురుచూడకుండా కాల్పులు ప్రారంభిస్తారని డెన్మార్క్ స్పష్టం చేసింది. గ్రీన్‌ల్యాండ్‌లోని మెజారిటీ ప్రజలు కూడా ‘‘గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు’’ అని అమెరికా చర్యల్ని వ్యతిరేకిస్తున్నారు. సహజవనరులు, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ ద్వీప జనాభా 57,000 మాత్రమే. ప్రతీ వ్యక్తికి డబ్బు ఇవ్వడం ద్వారా దీనిని అమెరికా కొనుగోలు చేయాలని అనుకుంటోంది.
సైనిక చర్యల దగ్గర నుంచి డబ్బుల దాకా, ఎలాగొలా గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. డబ్బు ఇవ్వడమే కాకుండా, మరో మార్గాన్ని కూడా అమెరికా పరిశీలిస్తోంది. ఇదే ఫ్రీ అసోసియేషన్ ఒప్పందం’ (COFA). చిన్న చిన్న ద్వీప దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ఇది. మైక్రోనేషియా, మార్షల్ ఐలాండ్స్, పలావ్ వంటి చిన్న ద్వీపాలు ఈ ఒప్పందం కిందకు వస్తాయి. ఈ ద్వీపాల రక్షణ, కమ్యూనికేషన్స్ అమెరికా పరిధిలో ఉంటాయి. అమెరికన్ సైన్యానికి అక్కడ స్వేచ్ఛగా తిరిగే అవకాశం, కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వాణిజ్యం ఎక్కువగా సుంకాలు లేకుండా జరుగుతుంది. నిజానికి ఈ ఒప్పందం అమలు కావాలంటే ముందు గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ నుంచి విడిపోవాలి. దీని కోసమే డబ్బుతో గ్రీన్‌ల్యాండ్ ప్రజల్ని కొనాలని చూస్తోంది.