అగ్రదేశం అమెరికాను కొత్త సమస్య వేధిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆ దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా దక్షిణ అమెరికాలో సమస్యను ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో ఈ కొరత తీవ్రంగా ఉందని అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వ్ చేసిన ఆక్సిజన్ వాడాల్సి వస్తుండగా… మరికొన్ని చోట్ల పూర్తిగా నిండుకునే పరిస్థితి ఉందని చెప్పారు.
‘సాధారణంగా ఆక్సిజన్ ట్యాంక్ 90 శాతం నిండి ఉంటుంది. ట్యాంక్‌లో 30 నుంచి 40 శాతం స్థాయికి ఆక్సిజన్ దిగడానికి వీలు కల్పిస్తారు. అప్పుడు ఎంతలేదన్నా మూడు నుంచి ఐదు రోజుల సరఫరాకు ఢోకా లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 10 నుంచి 20 శాతం స్థాయి వరకు ఆక్సిజన్ వాడాల్సి వస్తోంది. దాంతో ఒకటి, రెండు రోజుల వినియోగానికి మాత్రమే వీలుంటుంది. ప్రస్తుతం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’ అని అంటూ హెల్త్ కేర్ పెర్ఫామెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కంపెనీకి చెందిన డొన్నా క్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క డెల్టా కేసులు పెరుగుతుండటంతో..దక్షిణ అమెరికాకు చెందిన పలు రాష్ట్రాలు రిజర్వ్ ఆక్సిజన్‌ను వినియోగించే పరిస్థితి చేరుకోవడం కలవరపెడుతోంది.
దెబ్బకొడుతోన్న హరికేన్ ఇడా..
అసలే వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న లూసియానాను హరికేన్ ఇడా వణికిస్తోంది. అక్కడ దేశంలోనే అత్యల్ప వ్యాక్సినేషన్ రేటు(41.2 శాతం) నమోదైంది. దాంతో కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరోపక్క హారికేన్ ఇడా ఆదివారం తీరం దాటింది. దానివల్ల ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.ఇంకోపక్క హరికేన్‌తో గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటోంది. ఇది వైద్య సేవలపై ప్రభావం చూపుతోందని లూసియానా గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నారులకు పొంచి ఉన్న ప్రమాదం..
‘చిన్నారుల విషయంలో ఇది మాకు చాలా కఠిన సమయం’ అని డాక్టర్ ఎస్తేర్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు 12 ఏళ్ల వయసు లోపు వారికి టీకాలు అందుబాటులో లేవు. అలాగే దేశంలో కొన్ని చోట్ల పాఠశాలలు తెరుచుకోనప్పటికీ.. మరికొన్ని రోజుల్లో తెరిచే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఆసుపత్రుల్లో చేరే పిల్లల సంఖ్య పెరగనుంది. ‘చిన్నారుల ఆసుపత్రులు నిండిపోనున్నాయి. దాంట్లో అనుమానం లేదు. వారిలో కూడా మరణాలు సర్వసాధారణం అవుతాయి’ అని ఎస్తేర్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా పరిస్థితులపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పందించారు. డిసెంబరు నాటికి కొత్తగా లక్ష మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ‘లక్ష మరణాలు సంభవించొచ్చు కానీ వాటిని నివారించే అవకాశమూ ఉంది’ అని వ్యాఖ్యానించారు. డెల్టా వేరియంట్ మూలంగా 14 రాష్ట్రాల్లో వారం వ్యవధిలో మరణాలు 50 శాతం పెరిగాయి. 28 రాష్ట్రాల్లో 10 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. వీటన్నింటి మధ్య ఇటీవల కాలంలో టీకా కార్యక్రమం వేగవంతం కావడం కాస్త ఊరటనిస్తోందని అధికారులు అంటున్నారు.