Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఆయన గద్దెనెక్కబోతున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టాప్-10 ఆదేశాలు ఇవ్వబోతున్నారు. గతంలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కేవలం అప్పటి ఒబామా కేర్‌ని లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేవారు. ఈ సారి మాత్రం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
1) అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ.
ట్రంప్ కీలక హామీల్లో అక్రమ వలసదారుల బహిష్కరణ కీలకంగా ఉంది. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించబోతున్నారు. యూఎస్ అధ్యక్షుడినైన తొలి రోజే, నేరస్తులను బయటకు తీసుకురావడానికి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ట్రంప్ న్యూయార్క్ ర్యాలీలో చెప్పారు.
2) “బర్త్ రైట్ పౌరసత్వం” రద్దు..
అమెరికాలో జన్మించిన ఎవరికైనా యూఎస్ పౌరసత్వం వచ్చే విధానాన్ని రద్దు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. వేరే దేశానికి చెందిన జంటకు అమెరికాలో బిడ్డ జన్మిస్తే వారికి ఆటోమెటిక్‌గా అమెరికన్ పౌరసత్వం వస్తుంది. ఈ విధానాన్ని తీసేస్తాని ట్రంప్ ఎన్నికల్లో్ హామీ ఇచ్చారు.
3) కాపిటల్ హిల్ అల్లర్ల నిందితులకు క్షమాభిక్ష..
జనవరి 6, 2021లో ట్రంప్ ఓటమి తర్వాత ఆయన మద్దతుదారులు కాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ నేరంలో నిందితులను క్షమాభిక్ష ఇస్తానని ట్రంప్ చెప్పారు.
4) రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం..
తాను అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానంటు పలు సందర్భాల్లో ట్రంప్ ప్రకటించారు. తనకు జెలన్ స్కీ, పుతిన్ ఇద్దరు బాగా తెలుసని, వారు యూఎస్ అధ్యక్షుడిని నన్ను గౌరవిస్తారని, బైడెన్‌ని గౌరవించని అన్నారు.
5) సుంకాల పెంపు..
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హమీ ఇచ్చారు. జనవరి 20న తన మొదటి కార్యనిర్వహక ఉత్తర్వుల్లో ఈ రెండు దేశాల నుంచి యూఎస్‌లోకి వచ్చి ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ నవంబర్ 25న ప్రకటించారు.
6) బైడెన్ ‘‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ’’ రద్దు..
జో బైడెన్ పరిపాలన సమయంలో తీసుకువచ్చిన ‘‘‘ఎలక్ట్రిక్ వాహన ఆర్డర్స్’’ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. 2030 నాటికి అమ్ముడయ్యే కార్లు, ట్రక్కులలో 50 శాతం నెట్-జీరో ఉద్గారాలతో ఉండాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ‘‘ఎలక్ట్రిక్ వాహన ఆదేశాల’’ను నిలిపేయనున్నారు.
7) చమురు డ్రిల్లింగ్.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికా వ్యాప్తంగా చమురు డ్రిల్లింగ్ పెంచుతానని హామీ ఇచ్చారు. అమెరికాలో డ్రిల్లింగ్ పెంచడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గుతాయని చెప్పారు.
8) మహిళా క్రీడల నుంచి లింగమార్పిడి అథ్లెట్లను నిషేధించడం..
ట్రంప్ పలు సందర్భాల్లో ట్రాన్స్‌జెండర్ మహిళల్ని పురుషులుగా అభివర్ణించారు. తాను అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి వారిని మహిళల క్రీడల నుంచి 100 శాతం దూరంగా ఉంచుతా అని చెప్పారు.
9) లింగమార్పిడి సంరక్షణ పద్ధతులను ముగించడం..
హార్మోన్ థెరపీ కలిగి ఉండే లింగమార్పిడి సంరక్షణ పద్ధతులను కూడా అంతం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. లింగమార్పిడి సంరక్షణ అనే జో బైడెన్ క్రూరమైన విధానాలను తాను ఉపసంహరించుకుంటానని చెప్పారు.
10) అమెరికాలో ఆటో పరిశ్రమ..
అమెరికన్ ఆటోమొబైల్ పరిశ్రమను మళ్లీ పునరుజ్జీవింపజేస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్‌కి ఓటేయడం అంటే ఆటోమొబైల్ ఉత్పత్తులు భవిష్యత్తు అమెరికాలోనే తయారవుతాయని అన్నారు.