రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌లో నగరాలు వణికిపోతున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. రాజధాని కీవ్ పై కూడా రష్యా సేన దాడి చేయగా.. ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడులతో వెనుదిరిగింది. పాక్షికంగా దెబ్బతిన్న కీవ్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్ తిరిగి తెరుచుకుంది. అయితే, ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.
కానీ.. తొలిరోజు ప్రదర్శించిన మూడు ఆటలకు మొత్తం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో అవాక్కయ్యామని నటుడు యురియ్ ఫెలిపెంకో పేర్కొన్నారు. నగరానికి తిరిగొస్తున్న పౌరులను చూసి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైనట్లు మరో నటుడు కొత్స టిమ్లియాంక్ తెలిపాడు. కాగా.. ఉక్రెయిన్లో ఇంకా యుద్ధం జరుగుతున్న విషయాన్ని మరిచిపోకూడదని, నటులు ఏ విధంగా సహాయపడగలరన్నదే అసలైన ప్రశ్న అని ప్రదర్శనకారులు పేర్కొన్నారు.
Russia – Ukraine War: ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా
ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో మూడు నెలలకుపైగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యా సైన్యం.. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. ముఖ్యంగా డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకోవాలని భావిస్తున్న రష్యా.. వ్యూహత్మక నగరమైన సీవీరోదొనెట్స్క్‌పై విరుచుకుపడుతోంది. దీంతో అక్కడ ఉక్రెయిన్-రష్యా సేనల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను ఇచ్చేందుకు పశ్చిమదేశాలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.