ఒక ఇల్లు ఎంత ప్రైమ్ లొకేషన్‌లో ఉన్నా సరే.. అది బాగోలేదని టాక్ వచ్చిందంటే చాలు, దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎంత అద్భుతంగా ఉన్నా సరే, ససేమిరా అనేస్తారు. అలాంటిది.. దెయ్యాల కొంపగా ప్రపంచవ్యాప్తంగా పేరుగడించిన ‘ద కంజ్యూరింగ్ హౌస్’ రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు ఇళ్లు విక్రయించబడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఈ ఇంటికి 1736లో నిర్మించారు. ఈ ఇంట్లో ఏం జరిగిందో పెద్దగా తెలీదు కానీ.. 1971 నుంచి 1980 వరకు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివసించింది. ఈ కుటుంబానికి దెయ్యాలతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఘటనల ఆధారంగానే 2013లో కంజ్యూరింగ్ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపిన ఆ సినిమా పుణ్యమా అని.. ఆ ఇంటి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్నుంచి ఆ ఇల్లంటే అందరికీ హడల్. అలాంటి ఇంటిని 2019లో జెన్, కోరి హైన్‌జన్ అనే ఇద్దరు వ్యక్తులు సొంతం చేసుకున్నారు. ఆత్మలపై పరిశోధనలు చేసే వీళ్ళిద్దరు.. ఆ ఇల్లు తమ పరిశోధనలకు పనికొస్తుందని 4,39,00 డాలర్లకు కొనుగోలు చేశారు.
వాళ్ళ ప్రయోగాలు పూర్తయ్యాయో లేక వారికీ ఏవైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయో తెలీదు కానీ.. 2021 సెప్టెంబరులో ఈ ఇంటిని 1.2 మిలియన్ డాలర్లు ఆస్కింగ్ ప్రైజ్‌గా నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఆ దెయ్యాల కొంపను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ కొనరు.. అలాంటి అంత డబ్బు చెల్లించి ఎవరు సొంతం చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ.. ఈ భూత్‌బంగ్లాను ఓ వ్యక్తి 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే, ఆ కొత్త ఓనర్ ఎవరనేది మాత్రం గోప్యంగానే ఉంచారు.