Trump’s Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది. ట్రంప్ కొన్నాళ్ల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్న ‘‘పరస్పర సుంకాల’’ను ప్రకటించనున్నారు. అయితే, ఒక రోజు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తుందని తాను విన్నానని ఆయన అన్నారు.
భారత్‌తో పాటు చాలా దేశాలు కూడా సుంకాలు గణనీయంగా తగ్గిస్తాయని అనుకుంటున్నానని, ఎందుకంటే గత కొన్నేళ్లుగా అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కార్లపై తమ సుంకాలను 2.5 శాతానికి తగ్గించింది. ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తుందని వైట్ హౌజ్ తెలిపింది.
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
అమెరికన్ పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం, అమెరికన్ బియ్యంపై జపాన్ 700 శాతం సుంకాన్ని విధిస్తుంది, అమెరికన్ బటర్, అమెరికన్ చీజ్‌పై కెనడా దాదాపు 300 శాతం సుంకాన్ని విధిస్తుందని వైట్ హైజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 2021-22 నుంచి 2023-24 వరకు అమెరికా భారత్‌కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య 2023-24లో $22.73 బిలియన్ల వాణిజ్యం జరిగింది.
అయితే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేయడానికా రాబోయే రోజుల్లో ఇరు దేశాల అధికారు చర్చలు జరపాలని నిర్ణయించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని, భారత్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే రెండు దేశాల మంచికి ఉపయోగపడుతాయని ఇటీవల వాణిజ్య మంత్రి పియూష్ గోయాల్ అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ట్రంప్ కెనడా, చైనా, మెక్సికోలపై సుంకాలు విధించాడు. ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ముఖ్యంగా 10 నుంచి 15 దేశాలు పరస్పర సుంకాల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయి.