Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతికి వచ్చినప్పటి నుంచి అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు అక్కడ విలువ లేకుండా పోయింది. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, ఉద్యోగాలు చేయవద్దని, చివరకు మహిళల విద్యను కూడా తాలిబాన్లు నిషేధించారు. చివరకు బయటకు వెళ్లాలన్నా భర్త లేదా ఇతర బంధువులు తోడుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ మహిళలు తమ హక్కుల కోసం పోరాడేందుకు కూడా భయపడుతున్నారు. గతంలో హక్కులని నినదించిన మహిళల్ని తాలిబాన్ పోలీసులు చావబాదిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Read Also: KVP Ramachandra Rao: పురంధేశ్వరిపై జాలి పడుతున్నా.. బీజేపీ చేసిన పనులకు సమాధానం చెప్పాలి
ఇదిలా ఉంటే తాలిబాన్ ప్రభుత్వం మరోసారి ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది. ఒక నెలలోపు దేశంలోని అన్ని బ్యూటీ సెలూన్లను మూసేయానలి ఆదేశించింది. ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాన్ని కుదించడం కోసమే అని నైతి మంత్రిత్వశాఖ తెలిపింది. మహిళల కోసం ఉన్న బ్యూటీ పార్లర్లను నెలలోపు మూసేయాలని ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాదిక్ అకిఫ్ మంగళవారం తెలిపారు.
గతేడాది తాలిబాన్లు బాలికల ఉన్నత పాఠశాలలను మూసేశారు. విశ్వవిద్యాలయాల్లో మహిళలను నిషేధించారు. ఐక్యరాజ్యసమితి సంస్థల్లో కూడా మహిళలు పనిచేయొద్దని ఆదేశించారు. జిమ్, పార్కులు, స్మిమ్మింగ్ పూల్స్ లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారు. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో, అక్కడి పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. 2001 నుంచి అక్కడి ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ హరించుకుపోయింది. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.