తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. దీనికి అనుగుణంగా రవాణా చార్జీలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రీలంక ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. ఈ నిర్ణయం వల్లైనా ఇంధన కష్టాలు ఎంతో కొంత తీరుతాయని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. శ్రీలంక ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడ మార్చిలో 21.5 శాతం ద్రవ్యోల్భనం ఉంటే ఏప్రిల్ లో రికార్డ్ స్థాయిలో 33.8 శాతానికి చేరింది. దీంతో మరింతగా నిత్యావసరాలు, ఇతర ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటు వంటి పరిస్థితుల మధ్య శ్రీలంకలో ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా ఎనిమిది మంత్రులను కూడా నియమించారు. అయితే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి నియామకం జరగలేదు.
మరోవైైపు జౌషధాల కొరత శ్రీలంకు పెద్ద సమస్యగా మారింది. సంక్షోభం కారణంగా శ్రీలంకు వైద్య పరికరాలు, మందుల సరఫరా నిలిచిపోయింది. ఇంధన సమస్యల వల్ల కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 1948 తరువాత స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొలేదు. శ్రీలంక ఎకానమీకి వెన్నెముకలా ఉండే పర్యటకం కోవిడ్ వల్ల పడిపోవడంతో సంక్షోభం మరింతగా ముదిరింది. దీనికి తోడు రాజపక్స కుటుంబీకుల అవినీతి కూడా శ్రీలంక పరిస్థితికి కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు.