తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ప్రజలు రోడ్లపైకి వచ్చిన తన నిరసన తెలుపుతున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధ్యక్షడు గొటబయ రాజపక్సను గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజల ఆందోళలతో ప్రధాని పదవికి మహిందా రాజపక్సే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తీవ్ర పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది.
ఇదిలా ఉంటే తనపై వచ్చిన వ్యతిరేఖతను తొలగించుకునేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవల ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించారు. తాజాగా మరో 9 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాడు. కొత్త మంత్రుల్లో ప్రధాన ప్రతిపక్షం అయిన సమగి జన బలవేగయ (ఎస్జేబీ) నుంచి ఇద్దరు ఉండగా… రాజపక్స సొంత పార్టీ శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) నుంచి మంత్రులుగా మంత్రిమండలిలో చేరారు.
క్యాబినెట్ లో అధ్యక్షుడు, ప్రధానితో కలిపి 25 మంది సభ్యులకే పరిమితం కానున్నట్లు శ్రీలంక మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి)కి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి నిమల్ సిరిపాల డిసిల్వా, స్వతంత్ర ఎంపీలు సుసిల్ ప్రేమజయంత, విజయదాస రాజపక్ష, తిరన్ అల్లెస్‌లు శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన తొమ్మిది మంది కొత్త మంత్రుల్లో ఉన్నారు.
ప్రస్తుతం శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత అత్యంత దుర్బర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనీసం పెట్రోల్ కోనేందుకు కూడా ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. ప్రస్తుత పరిస్థితికి రాజపక్స కుటుంబ రాజకీయమే కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది శ్రీలంక ప్రభుత్వం. మరోవైపు జీ 7 దేశాలు కూడా శ్రీలంకకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చాయి.