దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారిన పడ్డారు. ఆయనలో కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిరిల్ రామఫోసా కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిరిల్‌కు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని అనుమానపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సిరిల్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కరోనా సోకడం గమనార్హం.
Read Also: ఒమిక్రాన్ విజృంభణతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఇటీవలే నైజీరియా వెళ్లివచ్చారు. డిసెంబర్ 8న సెనెగల్ నుంచి వచ్చిన తర్వాత పరీక్షలు చేయగా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆయన కోలుకునే వరకు ఉపాధ్యక్షుడు డేవిడ్ మాబుజా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఆదివారం ఒక్కరోజే 17,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7,861 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.