కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా లేదా కరోనా వల్ల శ్వాస పోకడలో జరిగిన మార్పుల వల్ల జరుగుతుందా అన్న విషయంలో స్పష్టత లేదన్నారు.
Read Also: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్.. పలు విమానాలు రద్దు
ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రికి చెందిన ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు బాధితులను పరిశీలించారు. సిటీ స్కాన్‌లు సహా అనేక ఇతర పరీక్షల్లో వీరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. అయితే కరోనా సోకినప్పుడు వీరు ఆస్పత్రిలో చేరలేదని, తీవ్ర అనారోగ్యం బారిన కూడా పడలేదని పరిశోధకులు వెల్లడించారు. అయినా కరోనా నుంచి కోలుకున్న ఏడాది తర్వాత వీరిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు వివరించారు. అలాంటి బాధితుల ఊపిరితిత్తుల్లో లోపాలను పరిశీలించేందుకు వినూత్నంగా జెనాన్ గ్యాస్ స్కాన్ విధానాన్ని ప్రయోగించారు. దీంతో అసలు లోపం బయటపడింది. బాధితుల ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి సాఫీగా సాగడం లేదని వెల్లడైంది. దీనికి గల కారణాలను వైద్యులు నిర్ధారిస్తే కావాల్సిన చికిత్సలు చేయించుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.