Scientists Revived 48500 Year Old Zombie Virus In Russia: ఇప్పటికే వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల కారణంగా.. ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఓవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు ప్రయోగాల పేరుతో వైరస్‌లు వ్యాపిస్తుండటం, ఘనీభవించిన మంచు కరిగిపోతుండటంతో.. మానవాళికి ముప్పు వాటిల్లుతోంది. ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఒక మంచు ప్రాంతంలో శాస్త్రవేత్తలు 48,500 ఏళ్ల నాటి ‘జాంబీ వైరస్’ను గుర్తించారు. అదొక్కటే కాదండోయ్.. మరో రెండు డజన్ల కొత్త వైరస్‌లను కూడా వెలికితీశారు. సాధారణంగా మంచు ప్రాంతాల్లో ఎన్నో రకాల డేంజరస్ వైరస్‌లు ఉంటాయి. మానవాళికి వాటి వల్ల ఏమైనా ముప్పు ఉందా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో ఈ జాంబీ వైరస్ బయటపడింది.
రష్యాలోని సైబీరియా ప్రాంతం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద లభ్యమైన నమూనాల్ని యూరప్ పరిశోధకులు పరీక్షించగా.. వాటిలో 13 రకాల హానికారకమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించారు. తమ పరిశోధనల్లో ఇవి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా తేలడంతో, శాస్త్రవేత్తలు వాటిని జాంబీ వైరస్‌లుగా భావిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయని.. అయినప్పటికీ అవి వ్యాధిక కారక శక్తిని ఏమాత్రం కోల్పోలేదని వాళ్లు తేల్చారు. అంటే.. ఇవి ఇప్పటికీ ప్రభావం చూపుతాయన్నమాట! ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మంచు ఖండాలు వేగంగా కరుగుతున్నాయని, తద్వారా గతంలో చిక్కుబడిపోయిన ‘మీథేన్’ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయని, అవి వాతావరణ మార్పులపై చాలా ప్రభావితం చూపుతాయని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నారు. అయితే.. ప్రభావం నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్‌లపై వాటి ప్రభావం ఉంటుందా? లేదా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.
తాజా పరిశోధనలో రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఒకవేళ ఈ జాంబీ వైరస్‌లు బయటి వాతావరణంలోకి విడుదలైతే.. జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశిస్తే.. ఎంతకాలం వరకు ప్రభావం చూపుతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఇవి సోకడానికి వాహకాలేంటో అంచనా వేయడం అసాధ్యంగా ఉందని వాళ్లు పేర్కొంటున్నారు. ఇవి ఎలాంటి ముప్పును కలిగిస్తాయో, ఇప్పుడే ఏ నిర్ణయానికి రాలేమని చెప్తున్నారు. కానీ, బయటకొస్తే మాత్రం ముప్పు తప్పకుండా ఉండొచ్చని అంటున్నారు.